అంతా రామమయం

by Disha Web Desk 15 |

దిశ, భద్రాచలం : మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది....ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళ శోభితమైన కళ్యాణ మండపంలో ఒకవైపు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుండగా.... మరోవైపు భక్తుల శ్రీరామ జయజయ రామ ద్వానాలతో మారుమోగింది. జగదభిరాముడైన శ్రీ సీతారామ చంద్రమూర్తుల కల్యాణంను కనులారా తిలకించిన భక్తజనకోటి పులకించింది. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు...కల్యాణ తంతును ఆద్యంతం వర్ణిస్తూ పండితుల ప్రసంగాలు... మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తజనంతో నిండిపోయింది.

శ్రీరాముని కల్యాణం చూడటమే మహద్భాగ్యంగా భావించిన భక్తులు అభిజిత్ లగ్నంలో రామయ్య, సీతమ్మ వార్ల జిలకర బెల్లం కళ్యాణ తంతు చూసి పరవసులయ్యారు. సీతారామచంద్రస్వామి వారు ప్రధాన ఆలయం నుంచి భక్తుల కోలాహలం నడుమ మేళతాళాలతో మండపానికి పది గంటలకు వచ్చి పెళ్లి పీటలపై ఆశీనులయ్యారు. తరువాత వేద పండితులు, అర్చక స్వాములు కల్యాణ తంతును వేద మంత్రాలతో ప్రారంభించారు. పుణ్యహావచనం నిర్వహించి రామయ్యకు అభిముఖంగా సీతమ్మ వారిని ఆసీనులను చేశారు. ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వర పూజ, స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్కాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు.

ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి దంపతులు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం స్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాశస్థ్యం ను వివరించారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలను భక్తులకు అర్చకస్వాములు చూపించి సరిగ్గా 12.06 నిమిషాలకు మాంగల్యధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులకు ఆండాళ్లమ్మ,

శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయంగా బంతులాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత తలంబ్రాల కార్యక్రమాన్ని 12.15కి కన్నుల పండువగా నిర్వహించి అష్టోత్తర హారతి స్వామి వారికి సమర్పించి కల్యాణ తంతును ముగించారు. దేవానత జీయర్ స్వామి పర్యవేక్షణలో కళ్యాణం జరుగగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సుప్రీం కోర్ట్ జడ్జి నరసింహ, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యే లు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ ప్రియాంక అలా, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్ రాజ్, ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

రేపు మహా పట్టాభిషేకం

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా, అదే వేదికపై గురువారం స్వామి వారికి మహా పట్టాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Next Story

Most Viewed