మున్సిపల్ జవాన్‌పై కౌన్సిలర్ భర్త బూతుల దండకం

by Dishafeatures2 |
మున్సిపల్ జవాన్‌పై కౌన్సిలర్ భర్త బూతుల దండకం
X

దిశ, కొత్తగూడెం: మున్సిపాలిటీ జవాన్‌పై కౌన్సిలర్ భర్త బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన కొత్తగూడెం క్లబ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షతన కొత్తగూడెం క్లబ్‌లో గురువారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న క్రమంలో స్టేజ్‌పై మాట్లాడుతున్న కొంతమంది ప్రజాప్రతినిధుల ఫోటోలను కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ జవాన్ అధికారులు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.

ప్రతిరోజు మున్సిపాలిటీ సిబ్బంది వారు విధులకు హాజరయ్యే పనిలో పాల్గొన్నాం అని చూపించడం కొరకు ఇలా గ్రూపులో ఫోటోలు పెడుతుంటారు. ఆది చూసిన 24 వ వార్డు కౌన్సిలర్ సత్యభామ భర్త సుందర్ రాజు ఫోటోలు పోస్ట్ చేసిన జవాన్‌పై బూతులతో విరుచుకుపడ్డాడు. ఆ గ్రూపులో మా ఫోటోలు ఎందుకు పెట్టలేదు ఎవరు పెట్టొద్దు అన్నారు అంటూ తన నోటికి వచ్చిన బూతులు తిడుతూ కేసయినా పర్వాలేదు నిన్ను చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా ఖంగుతిన్న జవాన్ ఎంతసేపు సర్ది చెప్పినా వినలేదు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవడు, ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా, నిన్ను చంపేస్తా అంటూ కౌన్సిలర్ భర్త తిడుతున్న బూతులకు బతుకమ్మ చీరల కోసం వచ్చిన లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు.


Next Story

Most Viewed