కమ్యూనిజం అజరామరం.. మరో వందేళ్లయినా ప్రజలతోనే : కూనంనేని సంచలన వ్యాఖ్యలు

by Chintha Aamani |

కమ్యూనిజం అజరామరం అని, మనిషి మనుగడ ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారని, ఈ వందేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందని,కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

కమ్యూనిజం అజరామరం.. మరో వందేళ్లయినా ప్రజలతోనే : కూనంనేని సంచలన వ్యాఖ్యలు
X

దిశ,కొత్తగూడెం : కమ్యూనిజం అజరామరం అని, మనిషి మనుగడ ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారని, ఈ వందేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందని,కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాబోయే వందేళ్ల కూడా అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటామని అన్నారు. ఆదివారం చుంచుపల్లి మండల 8వ మహాసభ ఆదివారం ఎన్ కె నగర్ లోని కమ్మ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. సభా ప్రాంగణం సీపీఐ జెండాలతో ఎరుపెక్కగా, మహాసభ ప్రారంభ సూచికగా అరుణ పతాకాన్ని కూనంనేని ఆవిష్కరించారు. సీహెచ్ మాధవరావు, పి రామచందర్, ఐదావత్ సుగుణ, తోట రాజు, పొలమూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో కూనంనేని మాట్లాడారు.

పేదలు, కార్మికులు, కర్షకుల కోసం పుట్టిన పార్టీ సిపిఐ అని, అధికారం ఉన్నా లేకున్నా సమసమాజ స్థాపనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పూటకో పార్టీ మారి రోజుకో కండువా కప్పుకోవడం గొప్పేంకాదని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ప్రజలకు మేలు చేసేందుకు పనిచేసే వారే నిజమైన నాయకులన్నారు. ఇప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీలు బూర్జువా పోకడలతో అటువారు ఇటు వారు అటు మారుతూ అధికారం కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మేమే గెలిపించామంటూ కొందరు గొప్పలు పోతున్నారని, కానీ కమ్యూనిస్టులే లేకుంటే మీ పరిస్థితి ఏంటో వారే అర్థం చేసుకుంటే మంచిదన్నారు. తెప్ప దాటిన తర్వాత దాన్ని తగులబెట్టే గుణం ఉన్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఇష్టానుసారంగా పొంగితే పొయ్యి పాలు కాక తప్పదన్నారు. ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి పట్టిందని గుర్తు చేశారు. ప్రపంచం వ్యాప్తంగా 260 కోట్ల మంది ప్రజలు కమ్యూనిస్టుల పాలనలో ఉన్నారని, ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీయే అతిపెద్ద పార్టీ అని చెప్పారు.

ఈ నెల 9న మోదీ పాలనకు వ్యతిరేకంగాదేశవ్యాప్త బంద్ కు పిలుపునిస్తే 30 కోట్ల మంది రోడ్డుమీదికి వచ్చారన్నారు. ఓట్ల కోసం డబ్బులు వెదజల్లుతూ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నానరని, దామాషా పద్దతిలో ఓట్లను లెక్కిస్తే ఎవ్వరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. 1964వ సం. వరకు కమ్యూనిస్టులంతా కలిసే ఉన్నారని, ఆ తర్వాతే చీలికలు వచ్చాయని, ఇకనైనా అంతా ఏకతాటిపైకి వస్తే రాజ్యం మనదే అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల లేకుండా చేస్తామని చెప్పుకుంటూ హతమారుస్తున్నారని, మనిషిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాంతి చర్చలకు సిద్దమే అంటూ మావోయిస్టులు పలుమార్లు లేఖలు విడుదల చేసినప్పటికీ దానిని పక్కకు నెట్టేసి అధికారం ఉంది కదా అని నరహత్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కొత్తగూడెం కేంద్రంగా శతజయంతి వేడుక సీపీఐ శతజయంతి వేడుక 2026 డిసెంబర్ 26న కొత్తగూడెం కేంద్రంగా కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతోందని, కమ్యూనిస్టుల సత్తా ఏంటో కారుకూతలు కూసేవారికి చూపిస్తామన్నారు. ఈ వేడుకకు ప్రపంచ దేశాల వ్యాప్తంగా కమ్యూనిస్టు యోధులు తరలి రానున్నట్లు కూనంనేని తెలిపారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా మాట్లాడుతూ స్థానిక సంస్థల సమరానికి అంతా సిద్ధంగా ఉండాలన్నారు. సీపీఐ చరిత్రను ప్రజల్లోనికి తీసుకెళదామని, మనుష్యులంతా ఒక్కటే అని, అంతరాలు లేని సమాజమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమని ప్రజలకు చాటి చెబుదామన్నారు. ఈ మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గ రాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్, చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళీ, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, గనగల్ల వీరస్వామి, వై.ఉదయ్ భాస్కర్, గెద్దాడు నగేష్, కంచర్ల జమలయ్య, బోనోత్ గోవింద్,బరిగల సంపూర్ణ, రమణమూర్తి, శ్రీశైలం, యాండ్ర మహేష్, ఎస్ నాగేశ్వరరావు, గుత్తుల సత్యనారాయణ, జకర్య తదితరులు పాల్గొన్నారు.

Next Story