- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఫాల్కన్’ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ముంబైలో ఎండీ అమర్‌దీప్ అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ (Falcon Invoice Discounting) స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్’ (Falcon Invoice Discounting) స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భారీ మోసానికి పాల్పడిన కీలక సూత్రధారి, ఫాల్కన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌ను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా విదేశాల్లో తలదాచుకున్న అతను, గల్ఫ్ దేశం నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబై పోలీసులు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ఏమిటీ ఫాల్కన్ స్కామ్..
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ కేంద్రంగా ‘క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Capital Protection Force Private Limited) అనే సంస్థను స్థాపించిన అమర్‌దీప్, ‘ఫాల్కన్’ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను రూపొందించాడు. అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ ఎంఎన్‌సీ (MNC) కంపెనీల ఇన్వాయిస్‌లను డిస్కౌంట్‌కు కొనుగోలు చేస్తామని, అందులో పెట్టుబడి పెడితే ఏడాదికి 11 శాతం నుంచి 22 శాతం వరకు లాభాలు ఇస్తామని నమ్మించారు. అలా బాధితుల నుంచి సుమారు రూ.1,700 కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.850 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ, మిగిలిన రూ.850 కోట్లతో నిందితులు బోర్డు తిప్పేశారు. దాదాపు 7 వేల మందికి పైగా బాధితులు ఆందోళనతో రోడ్డెక్కారు. అయితే, పరిస్థితి చేదాటక ముందే ఎండీ అమర్‌దీప్ తన ప్రైవేట్ జెట్ విమానంలో దుబాయ్‌కు పరారయ్యాడు. ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే అమర్‌దీప్‌కు చెందిన రూ.18 కోట్ల విలువైన ఆస్తులను, ఒక హాకర్ 800A ప్రైవేట్ జెట్ విమానాన్ని, లగ్జరీ కార్లను సీజ్ చేసింది. వసూలు చేసిన సొమ్మును క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ మరియు విదేశీ షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు.
ఇప్పటికే సంస్థ సీఈవో, అమర్‌దీప్ సోదరుడి అరెస్ట్..
సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW), సీఐడీ అధికారులు ఇప్పటికే అమర్‌దీప్ సోదరుడు సందీప్ కుమార్‌తో పాటు సంస్థ సీఈవో, ఇతర కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడైన అమర్‌దీప్‌పై గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ అమర్‌దీప్ ముంబై విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై పోలీసులు అమర్‌దీప్‌ను ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విచారణలో భాగంగా మరిన్ని షెల్ కంపెనీల వివరాలు,విదేశాలకు మళ్లించిన నగదు గురించిన కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.






