కొద్ది మంది కోసమే ధరణి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కొద్ది మంది కోసమే ధరణి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రెవెన్యూ వ్యవ‌స్థను గ్రామీణ స్థాయి నుంచి ప‌టిష్టం చేయాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ‌తంలో ఏ చిన్న‌ గ్రామంలో చూసినా వీఆర్ఏ లేదా వీఆర్ఓ ఎవ‌రో ఒకరు గ్రామంలో ఉండే వార‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌లు చేస్తున్న త‌ప్పుల‌ను బ‌య‌ట‌కు లీక్ చేస్తార‌ని ఆ వ్య‌వ‌స్థ‌నే భ్ర‌స్టు ప‌ట్టించారు. ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఒక వ్య‌క్తి ఉండేలా చూడ‌టమే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌తి ఉద్యోగ‌స్తుడికి ఒక‌టో తేదీ నుంచి 5 లోపే జీతం అకౌంట్ల‌ల్లో ప‌డేలా చూడ‌టం ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌న్నారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌(టీజీటీఏ) నూత‌న సంవత్స‌ర డైరీ, క్యాలెండ‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌ ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగ‌ణంలో జ‌రిగింది. డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి డైరీ, క్యాలెండ‌ర్ల‌ను ఆవిష్క‌రించి మాట్ల‌డారు.

నాడు అందరి స్వేచ్ఛ‌ను హ‌రించారు..

గ‌త ప్ర‌భుత్వంలో వ్య‌క్తి స్వ‌చ్ఛ‌ను హ‌రించార‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆరోపించారు. సామాన్యుడే కాదు.. ఏ ఉద్యోగి కూడా మాట్లాడే ప‌రిస్థితి లేద‌న్నారు. ఆనాడు 10-25 తేదీల వ‌ర‌కు ఉద్యోగుల‌కు జీతాలు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌న్నారు. ఎవ‌రో ఒక్క‌రో ఇద్ద‌రో త‌ప్పు చేస్తే మిగ‌తా ఉద్యోగుల‌ను ఇబ్బందులు పెట్టిన సంద‌ర్బాలు కోకొల్లలుగా ఉన్నాయ‌న్నారు. క‌నీసం ప్ర‌జ‌లు చెప్తున్న దానిని కూడా వినే వ్య‌వ‌స్థ గ్రామ స్థాయిలో లేకుండా చేశార‌న్నారు. ఇటు ప్ర‌భుత్వానికి, అటు ప్ర‌జ‌ల‌కు వార‌ధులుగా ఉన్న ఉద్యోగ‌స్థులు ముఖ్యంగా రెవెన్యూ సెక్టారులోనే ఉన్నారన్నారు. ఈ క‌మ్యూనికేష‌న్‌ని ప్ర‌భుత్వ ప‌క్షాన వినే పెద్ద‌లు లేక‌పోవ‌డంతో.. ఈనాడు గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను గ‌త ప్ర‌భుత్వం టోట‌ల్‌గా ఎత్తేసిన కార‌ణంగా ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులను ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న‌ట్టుగా తెలిపారు.

ధ‌ర‌ణి కార‌ణంగానే ప్ర‌జ‌ల్లో మార్పు మొద‌లైంది :

ధ‌ర‌ణి అనే ఒక పోర్ట‌ల్‌ను తీసుకొచ్చి ప్ర‌జ‌ల‌ను కొత్త ఇబ్బందుల‌కు గురి చేశార‌న్నారు. ప్ర‌భుత్వంలో సంస్క‌ర‌ణ‌లు, మార్పులు అవ‌స‌ర‌మ‌న్నారు. ఏ సంస్క‌ర‌ణ‌లు చేసినా, ఏ మార్పులు తెచ్చిన కొద్ది మంది వ్య‌క్తుల కోసం సంస్క‌ర‌ణ‌లు చేయ‌వ‌ద్దన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు, పేద‌వాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్య‌క్తుల‌కు మ‌నం చేసే సంస్క‌ర‌ణ‌లు ఉప‌యోగప‌డాల‌న్నారు. మ‌నం తీసుకొచ్చే చ‌ట్టాలు సామ‌న్య ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్నారు. సంస్క‌ర‌ణ‌లతో వ‌క్ర మార్గంలో తెచ్చిందే ధ‌ర‌ణి అని అన్నారు. ఈ ధ‌ర‌ణిలో స‌మ‌స్య‌లు, సామాన్యులు ప‌డుతున్న ఇబ్బందులు.. తుది ఫ‌లితం ఆనాటి ప్ర‌భుత్వం మార్పు కావాల‌ని ప్ర‌జ‌ల్లో బలంగా ఏర్ప‌డింద‌న్నారు.

ధ‌ర‌ణి ప్ర‌క్షాళ‌న‌తో సామాన్యుల‌కు మేలు :

ధ‌ర‌ణిని, ధ‌ర‌ణిలో ఉన్న లొసుగుల‌ను, ధ‌ర‌ణిలో గ‌త ప్ర‌భుత్వ చేసిన త‌ప్పుల‌ను, ప్ర‌క్షాళ‌న చేసి సామాన్య ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న‌దే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి అన్నారు . ఈ ప్ర‌భుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు కాదు.. ప్ర‌భుత్వంలో ఉద్యోగ‌స్తులంద‌రూ కూడా భాగ‌స్వాములేన‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌చ్చిందంటే.. మొద‌ట ఆ మంచి పేరు ద‌క్కేది ఉద్యోగ‌స్తుల‌కేన్నారు. మీ అంద‌రికీ మంచి పేరు వ‌స్తే.. సీఎంకు, మంత్రుల‌కు, అంద‌రికీ మంచి పేరు వ‌స్తుంద‌న్నారు.

ధ‌ర‌ణి లొసుగులో ప్ర‌భుత్వ భూములు మాయం :

ఇందిర‌మ్మ రాజ్యంలో గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాలు, దోపిడీలు, భూక‌బ్జాలు వీటిన్నిటికి చెక్కు పెట్ట‌డానికి ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌న్నారు. ధ‌ర‌ణిని ప్ర‌క్షాళ‌న చేసి, దీనిలో గ‌త ప్ర‌భుత్వంలో ఏ విధ‌మైన త‌ప్పులు జ‌రిగాయో, ధ‌ర‌ణితో ఎవ‌రైతే న్యాయంగా భూముల‌ను కోల్పోయారో వారికి న్యాయం చేస్తామ‌న్నారు. ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకొని కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి భూముల‌ను కాపాడిన‌, ఆనాటి రెవెన్యూ ఉద్యోగుల‌ను కాద‌ని, ధ‌ర‌ణి చ‌ట్టం అనే లొసుగును అడ్డం పెట్టుకొని తాత‌లు, తండ్రులు క‌ష్ట‌ప‌డి ఆస్తుల‌ను నిల‌పెడితే.. గ‌త ప్ర‌భుత్వం ఆ ఆస్తుల‌ను వారి తొత్తుల‌కు క‌ట్టపెట్టిందన్నారు. ఎవ‌రికైతే క‌ట్ట పెట్టిన ఆస్తుల‌ను రెవెన్యూ ఉద్యోగుల స‌హకారంతో పేద వారికి ఇచ్చే చిత్త‌శుద్ధితో ఈ ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. మీ ఉద్యోగుల క‌ష్టాల‌లో నేను భాగ‌స్వామ్యం అవుతాన‌న్నారు. పూర్తి విశ్వాసంతో క‌ష్ట‌ప‌డి మీకు ప్ర‌భుత్వానికి మంచి జ‌రిగే విధంగా ప‌ని చేయాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ క‌లెక్టర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యద‌ర్శి కె.రామ‌కృష్ణ, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ర‌మేష్ రాథోడ్‌, అసోసియేట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెంక‌ట్‌రెడ్డి, ప‌ద్మప్రియ‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పూల్‌సింగ్ చౌహాన్‌, ఆరేటి రాజేశ్వ‌ర్‌, శ్రీ‌నివాస్‌శంక‌ర్‌, పుష్య‌మి, ఎస్‌పీఆర్ మ‌ల్లేష్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed