రోజూ తిరుమల ఆలయాన్ని తెరిచేది యాదవుడే: మాజీమంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

చిన్నారి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు.

రోజూ తిరుమల ఆలయాన్ని తెరిచేది యాదవుడే: మాజీమంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారి మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. కుమ్మేర మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని నాగర్‌కర్నూల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని గురువారం తలసాని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభంశుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు గడుస్తున్నా బడుగు బలహీన వర్గాల ప్రజలపై వివక్ష, దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేవుడిని దర్శించుకునే అర్హత బలహీన వర్గాలకు లేదా అని నిలదీశారు. దోషులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 15 రోజుల్లో వారిపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.

నీతి, నిజాయితీకి మారుపేరు యాదవులు

శ్రీ కృష్ణుడి వారసులుగా యాదవులకు గుర్తింపు ఉన్నదని.. నీతికి, నిజాయితీకి మారుపేరుగా యాదవులు నిలుస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గ పరిధి పదిర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణుడి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి తలసాని హాజరయ్యారు. హైదరాబాద్ నుండి భారీ వాహన శ్రేణితో బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో కడ్తాల్, కడ్తాల్ టోల్గేట్, డిండి, దేవరకొండ చౌరస్తా తదితర ప్రాంతాల్లో యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై గజమాలతో సత్కరించారు. అనంతరం పదిర గ్రామానికి చేరుకోగా డప్పు చప్పుళ్ళు, బాణసంచా కాలుస్తూ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవులకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నదన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెల్లవారుజామున 2.30 గంటలకు మొదటగా తెరిచేది యాదవుడే అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో జనాభా కలిగిన జాతి యాదవులని అన్నారు.

Next Story