పెండింగ్ సాదాబైనామాలకు పరిష్కారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Ramesh Naini |

దశల వారీగా భూ సర్వే నిర్వహించి భూధార్ కార్డులను ఇస్తామని, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

పెండింగ్ సాదాబైనామాలకు పరిష్కారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: దశల వారీగా భూ సర్వే నిర్వహించి భూధార్ కార్డులను ఇస్తామని, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందని, కానీ 2020 ఆర్ఓఆర్ చట్టంలో పరిష్కారం మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించడం జరిగిందని, అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు జీవో.76 ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందని తెలిపారు.

రూ. 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారు..

నక్ష లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాలల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించామని, ఇందులో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించడం జరిగిందని అన్నారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్ లోని లోసుగులను ఆసరాగా చేసుకొని కొంత మంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ. 3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని, దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. తప్పు చేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని తెలిపారు. శాసన మండలిలో సభ్యులు తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆనాడు ధరణి పోర్టల్ ను నాలుగు గోడల మధ్య ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని, దీని వల్లే కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్ లో 6 కు కుదించామని, ధరణి పోర్టల్ ను అర్ధరాత్రి ఒక్కరోజు మార్చేది కాదని, దశలవారీగా మార్పులు చేసుకుంటూ వస్తున్నామని, ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్ ను తెస్తామని తెలిపారు.

Next Story