బీజేపీ తెలంగాణకు శనిలా మారింది: కేసీఆర్ ఫైర్

by Gantepaka Srikanth |

బీజేపీ తెలంగాణకు శనిలా మారింది: కేసీఆర్ ఫైర్

బీజేపీ తెలంగాణకు శనిలా మారింది: కేసీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలు, ప్రజల హక్కుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుంటే ఇక చూస్తూ ఊరుకోబోయేది లేదని, ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని ఇకపై తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడికక్కడ తోలు తీస్తామని హెచ్చరించారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఇంతపెద్ద దోపిడీ జరుగుతుంటే ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. ఇక తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాఉద్యమాన్ని చేస్తామన్నారు.

చంద్రబాబు మాట వినే కేంద్రం అలా..

ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని కేసీఆర్ విమర్శించారు. ఎంత దద్దమ్మ ప్రభుత్వమైనా పాత ప్రాజెక్టులు కొనసాగించాలి కదా? అని ప్రశ్నించారు. డీపీఆర్ వెనక్కి పంపితే భూమి ఆకాశం ఒక్కటి చేయాల్సిన ప్రభుత్వం కుయ్యుమనడం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ శనిలా మారిందని, చంద్రబాబు మాటలు విని గతంలోనూ ఇబ్బంది పెట్టిందన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు మాట వినే డీపీఆర్ వెనక్కి పంపిందని ఆరోపించారు. బచావత్ ట్రైబ్యునల్ 45 టీఎంసీలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆపుతోందన్నారు. దీనిపై త్వరలో భారీ బహిరంగ సభలు పెడుతామని, తాను స్వయంగా వస్తానని తెలిపారు.

ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం..

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. నిద్రపోతోందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎంతసేపూ భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా? రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని ప్రభుత్వం.. ఇదేమి దద్దమ్మ ప్రభుత్వం? అని నిలదీశారు. జంటనగరాల్లో పట్టబగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కులేదన్నారు. పచ్చి అబద్ధాలు, వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి, అర్రాసు పాటలు పాడి అధికారంలోకి వచ్చారని అన్నారు.

Next Story