టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక?

by Disha Web Desk 4 |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే ఈ రాజీనామాను స్పీకర్ క్షణాల్లో ఆమోదం తెలపడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే.. ఆమోదించకుండా కొంత కాలం పాటు పెండింగ్ లో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయనే విశ్లేషణలు వచ్చినప్పటికీ స్పీకర్ నిర్ణయం మాత్రం స్పష్టంగా కనిపించింది. జెట్ స్పీడ్ తో ఆయన రిజిగ్నేషన్ కు ఆమోద ముద్ర వేశారు. స్పీకర్ చర్యతో ఇటు ప్రతిపక్షాలతో పాటు టీఆర్ఎస్ లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఈటల తరహాలోనే కోమటిరెడ్డిపై నిర్ణయం

గతంలో ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. స్పీకర్ గంటల వ్యవధిలోనే రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ వేగంగా నిర్ణయం తీసుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందనే టాక్ వినిపిస్తోంది. హుజూరాబాద్ ఫలితం ఎలా ఉన్నా.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆలస్యం చేస్తే అది టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కేసీఆర్ రాజీనామా అందిన వెంటనే ఆమోదముద్ర వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక ఇష్టం లేదని ఇప్పటికే బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మునుగోడులో ఫలితం చేదుగా ఉంటే ఆ ప్రభావం రాబోయే సాధారణ ఎన్నికల్లో పడుతుందని అందువల్ల రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా కొంత కాలం కాలయాపన చేసి ఆలోపు కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించకుండా వెనకడుగు వేస్తే ప్రజల్లోకి టీఆర్ఎస్ నిజంగానే ఆందోళనలో ఉంది అనే మెసేజ్ వెళ్తుందని గ్రహించిన కేసీఆర్.. రాజీనామా పత్రం అందడమే తరువాయి ఆమోద ముద్ర వేసేలా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందడంతో ఈ రోజు నుండి రాబోయే ఆరు నెలల్లోపు మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ లెక్కన నవంబర్ లో గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో వాటితో పాటుగా ఇక్కడ బై ఎలక్షన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు?

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరుకు సెమీస్ గా భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మునుగోడుతో పాటు మరికొన్ని ఉపఎన్నికలు వస్తాయని, వాటికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణం అవుతారని చెప్పడం టీఆర్ఎస్ వర్గాల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని, త్వరలోనే వారంతా పార్టీకి, పదవులకు రాజీనామా చేయబోతున్నట్లు బీజేపీ నేతలు పదే పదే చెప్పడం గులాబీ పార్టీని టెన్షన్ కు గురి చేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు గాలంలో పడి ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి.. పదవులకు సైతం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయంతో ఉంటే వారి రాజీనామాలను ఇంతే వేగంగా ఆమోద ముద్ర పడతాయని తాజా ఎపిసోడ్ తో కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పదవులకు రాజీనామా చేస్తే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా మొదటికే మోసం వస్తుందని ఎమ్మెల్యేలకు ఆలోచన కల్పించడం ద్వారా మరికొన్ని ఉప ఎన్నికలను తప్పించే ఎత్తుగడకు కేసీఆర్ పూనుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం చెందడంతో మునుగోడు రాజకీయం మరింత హీటెక్కనుంది. బరిలోకి దిగబోయే అభ్యర్థులెవరనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

Next Story

Most Viewed