కేసీఆర్‌‌ను కూడా విచారించాల్సిందే.. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురుపోసకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు.

కేసీఆర్‌‌ను కూడా విచారించాల్సిందే.. ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విషయంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురుపోసకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇవాళ కరీంనగర్‌ (Karimnagar)లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను మొదటి నుంచి అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని అన్నారు. అందరి కంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ హైదారాబాద్ (Hyderabad), సిరిసిల్ల (Srisilla) కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఇప్పటికే ప్రజలకు విషయం అర్థం అయిందని.. కుట్ర వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభాకర్ రావుకు రాచమర్యాదలా..

ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాథాకిషన్ రావు‌లు అనేక కుటుంబాలను నాశనం చేశారని.. వారికి బీజేపీ నాయకులు, కార్యకర్తల ఉసురు తగులుతుందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రభాకర్ రావు విదేశాలకు పారపోయాడని.. ఇప్పుడు స్వదేశానికి వచ్చి సుప్రీం కోర్టు నుంచి ఊరట పొందిన ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఇతర పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, న్యాయమూర్తులు, సినీతారల ఫోన్ల కూడా వదిలిపెట్టలేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలని అన్నారని గుర్తు చేశారు.

ఆ అధికారమే ఉంటే ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లం..

సిట్ విచారణ తూతూమంత్రంగా కొనసాగుతోందని.. విచారణను కేవలం అధికారులకే పరిమితం చేయొద్దని అన్నారు. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా.. పెద్దాయి చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)కు నోటీసులిచ్చి విచారించాలని అన్నారు. సిరిసిల్ల కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో కేటీఆర్‌ (KTR)ను విచారించాలని పేర్కొన్నారు. ఇది జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని.. వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఇదే ప్రభాకర్ రావు.. సిరిసిల్ల పోలీస్ కమిషనర్ ఆఫీస్‌ను అడ్డాగా చేసుకుని.. తమ ఫోన్లను వినుకుంటూ తమపై 109 కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నేడు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని.. సిన్సియర్ ఫెల్లోలా గడ్డం పెంచి, అమాయకంగా మొహం పెడితే ప్రభాకర్ రావును ఎవరూ నమ్మరని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను గద్దె దించింది.. కేసీఆర్ మెడలు వంచి పోరాటాలు చేసింది ముమ్మాటికీ బీజేపీ (BJP) పార్టీయేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ (CBI) విచారణకు తాము సిద్ధమని.. కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశం లేదన్నారు. ఒకవేళ అలా ఉంటే.. ఎన్నడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లమని బండి సంజయ్ కామెంట్ చేశారు.

Next Story