మహారాష్ట్ర స్థానిక సంస్థలే లక్ష్యం.. రెండో సభను అక్కడ నిర్వహించేందుకు బీఆర్ఎస్‌ సన్నాహాలు

by Disha Web Desk 13 |
మహారాష్ట్ర స్థానిక సంస్థలే లక్ష్యం.. రెండో సభను అక్కడ నిర్వహించేందుకు బీఆర్ఎస్‌ సన్నాహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర స్థానిక సంస్థలే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. మొదటి అడుగు ఆ ఎన్నికలతోనే వేయాలని భావిస్తున్న ఆ రాష్ట్రంలో పార్టీ యాక్టీవిటీస్‌ను ముమ్మరం చేశారు. రెండో సభను కందార్ లోహలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని తెలుగువారితో పాటు అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్‌లో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ తొలి అడుగు మహారాష్ట్రతోనే వేయాలని భావిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. యవత్మాల్, వార్ధా, వాసిం, నాందేడు, చంద్రపూర్, గడ్చిరోలి, కందార్ పై ప్రధాన ఫోకస్ పెట్టారు.

ఫిబ్రవరిలో నాందేడులో మొదటి సభను సక్సెస్ గా నిర్వహించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. అయితే రెండోసభను కందార్ లోహలో ఈ నెల 26న నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన నేతలతో పాటు పలుపార్టీలకు చెందిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చేరేలా ఇప్పటికే సంప్రదింపులు చేశారు. సభా వేదికపైనే చేరేలా చర్యలు చేపట్టారు. తెలంగాణేతర రాష్ట్రాల్లో మొదటి అడుగును విజయంతో ప్రారంభించాలని భావిస్తున్న కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

కందార్ లోహలో నిర్వహించే సభ బాధ్యతలను పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డికి అప్పగించారు. గత కొద్దిరోజులుగా ఆయన అక్కడే పర్యటిస్తున్నారు. నేతల సమీకరణ, విజయవంతానికి తీసుకోవాల్సిన అంశాలపై స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మండలాలవారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం సభ నిర్వహించే స్థలాన్ని జీవన్ రెడ్డి పరిశీలించారు.తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు. మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ హిమాన్షు తివారి, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర కిషన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ కదం ప్రవీణ్, శివాన్క్, అంకిత్ యాదవ్, గణేష్ బాబు రావు కదం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed