- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ సంస్థాగత నిర్మాణంపై KCR మౌనం.. స్టేట్ పాలిటిక్స్‌పైనే ఎక్కువ ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడదలైంది. కానీ బీఆర్ఎస్ మాత్రం సంస్థాగత నిర్మాణంపై ఉలుకు, పలుకు లేకుండా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి బలం ఎంతో అవసరం. అయితే.. బీఆర్ఎస్ మాత్రం ఎంతసేపూ రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి.. స్థానికతను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్.. టీఆర్‌ఎస్‌గా ఉన్న సమయంలో 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించింది. ఎప్పటికప్పుడు పార్టీలో పదవులు కేటాయిస్తుండేవారు. జిల్లా కమిటీల బలోపేతంపైనా నిరంతరం అధ్యయనం చేసేవి. అయితే.. అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు బదలాయించింది. అంతే కాకుండా పార్టీ బీఆర్ఎస్‌గా మార్పు చెందిన నాటి నుంచి కమిటీలు వేయలేదు. 2022 జనవరి 26న అధిష్టానం 33 జిల్లాలకు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. అయితే.. ఆ ప్రకటన జిల్లా అధ్యక్షుల వరకే పార్టీ పరిమితం చేసింది. జిల్లా, పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను మాత్రం నియమించలేదు. 2017లో అప్పటి టీఆర్‌ఎస్ మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే నేటికీ కొనసాగుతున్నది.
పునరుద్ధరణకు నోచని కమిటీలు
జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. ఏడేళ్ల క్రితం బీఆర్‌ఎస్ అధిష్టానం జిల్లా కమిటీలను రద్దు చేసింది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ వ్యవహారాలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వ అధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను పునరుద్ధరించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ మధ్య పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలోనూ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. వెంటనే సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని వెల్లడించినా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించాలని, లేని పక్షంలో పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేతను కోరారు. కానీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సంస్థాగత పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి కనిపిస్తున్నది.
స్థానిక సంస్థల్లో గెలుపెలా?
సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో గ్రామ స్థాయిల్లోని కేడర్‌లో ఆందోళన కనిపిస్తున్నది. పార్టీని నడిపించేవారు లేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో లేక ఇప్పటికే చాలా మంది కేడర్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యవర్గాలు, పదవులు లేకపోవడంతో ఉన్న వారిలోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పటికైనా సంస్థాగతంపై దృష్టి సారించి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతో కొంత సత్తాచాటుతుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నది.






