దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధం: లాల్ సింగ్ ఆర్య

by Disha Web Desk 19 |
దళితులను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధం: లాల్ సింగ్ ఆర్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి పీఠం దళితుడికేనని చెప్పి కేసీఆర్ దళితులను మోసం చేశారని, ఇప్పుడు విగ్రహం ఏర్పాటుతో దళితులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగం మారుస్తానని చెప్పి అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు. తెలంగాణలో దళితులపై దాడులు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి దళిత, అంబేద్కర్, రాజ్యాంగ వ్యతిరేకి అని విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్గీకరణపై రాజకీయ తీర్మానం కూడా చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 14 నుండి మే 5 వరకు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దళిత వాడల్లో, దళిత బస్తీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి వివరిస్తామన్నారు. ఏప్రిల్ 14 న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగా అంబేద్కర్ జయంతి నిర్వహించాలని ఆయన బీజేపీ నేతలకు సూచించారు.

Next Story