- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: ధైర్యం కోల్పోవద్దు.. నా సహకారం ఉంటుంది
పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా 15 రోజులుగా అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించబడ్డ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డిని ఆయన వెంట తీసుకెళ్లారు. జరిగిన విషయాలను కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ధైర్యం కోల్పోవద్దని.. తన సహకారం ఎప్పటికీ ఉంటుందని సూచించారు. అలాగే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. కడియం శ్రీహరి ఓటమి ఖాయమని.. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని ధీమా కల్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
పార్టీలో చేరికలు
అలాగే.. ఉమ్మడి ధర్మసాగర్ మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మంగళవారం వారు లాంఛనంగా కేసీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈనెల 15వ తేదీన సుమారు వెయ్యి మంది అనుచరులతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఆగడాలు, నియోజకవర్గ పరిస్థితులను రాజయ్య కేసీఆర్‌కు వివరించారు.
పది మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే ఈ పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్‌పై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్నది. మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. దీంతో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ అనర్హత వేటు పడితే.. తెలంగాణలో ఉపఎన్నికలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ సైతం ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. కాగా.. ఈ కేసు విషయంలో ఇప్పటికే అసెంబ్లీ సెక్రెటరీ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం జారీ అయ్యాయి.






