ఇవన్నీ భయపెట్టేందుకు చేసే పనులే: కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు.

ఇవన్నీ భయపెట్టేందుకు చేసే పనులే: కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఖండించారు. ఈ ఘటన రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణను సాధించిన మహనీయుడైన కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడం అంటే తెలంగాణ ప్రజల గౌరవంపై దాడి చేసినట్టేనని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత కార్యాలయంపై దాడి జరగడం అత్యంత ఆందోళనకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అధికార అహంకారంతో కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను భయపెట్టేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారికి ప్రభుత్వం అండగా నిలిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి అణచివేతలు చేసినా వెనక్కి తగ్గబోమని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story