ఏసీపీ సీటు.. ఒక్కొక్కరి జీవితం మార్చేస్తున్న కార్వాన్ చైర్

by Bhanu |   (  Updated:2025-06-24 14:05:43  IST  )

జీహెచ్‌ఎంసీ కార్వాన్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పదవి ఇప్పుడు అధికారులకు గండంగా మారింది.

ఏసీపీ సీటు.. ఒక్కొక్కరి జీవితం మార్చేస్తున్న కార్వాన్ చైర్
X

దిశ, కార్వాన్: జీహెచ్‌ఎంసీ కార్వాన్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పదవి ఇప్పుడు అధికారులకు గండంగా మారింది. గత పదిహేను నెలల కాలంలో ఈ సీటును అధికారు ఎంతగా చేరుకుంటున్నారో, అంత వేగంగా వదిలించుకుంటున్నారు. అనూహ్య సంఘటనలు, అనారోగ్యాలు, సస్పెన్షన్లు, బదిలీలతో ఈ పదవి ఇప్పుడు "అశుభస్థానంగా" మారిందన్న భావన అధికారులు మధ్య పుకార్లకు దారి తీసింది.

2023లో విజయశ్రీ ఈ సీటులో ఏసీపీగా బాధ్యతలు చేపట్టారు. సుమారు ఏడాది పాటు విధులు నిర్వర్తించి, సాధారణ బదిలీపై వెళ్లిపోయారు. ఆమె అనంతరం వచ్చిన పావని మాత్రం ఎక్కువ కాలం విధుల్లో కొనసాగలేకపోయారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే, ఓ అక్రమ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అంశంపై ఆమెను సస్పెండ్ చేశారు.

తర్వాత తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టిన కృష్ణ మోహన్ రెండే నెలల్లో హార్ట్ ఎటాక్‌తో హాస్పిటల్ పాలై మెడికల్ లీవులోకి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి బాధ్యతలు చేపట్టిన సుమన ఏసీపీ, 3నెలలు మాత్రమే విధులు నిర్వహించగలిగారు. ఇటీవల ఆమె క్యాన్సర్‌తో మృతిచెందడం అధికారులు మధ్య ఆందోళనను రెట్టింపు చేసింది.

ఈ నలుగురు అధికారుల విషయంలో ఒక ప్రత్యేకత గమనార్హం.. వీరిలో ఇద్దరు కార్యాలయంలో వాస్తు ప్రకారం తమ కూర్చీ స్థానాలు మార్చినట్టు సమాచారం. అదే సమయంలో ఇలాంటి అనుకోని పరిణామాలు జరగడం “వాస్తు దోషం” ఉందని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇటీవల జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన బదిలీలలో కార్వాన్ సర్కిల్-13 ఏసీపీ పోస్టును ప్రస్తావించకపోవడం, ఈ స్థానం కుతూహలానికి దారితీసింది. ఇక ఉన్నతాధికారులు కూడా ఈ పోస్టులో కొత్త నియామకం గురించి ప్రకటన చేయకపోవడంతో ఎవరు వస్తారు? ఎవరు వస్తారు అనే ఉత్కంఠ ఇంకా పెరిగిపోతోంది.

ఇదిలా ఉండగా ఇక్కడే ఉన్న ఓకే ఒక్కడు టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్ ను సైతం మెహిదీపట్నం సర్కిల్ 12 కు బదిలీ చేశారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రభావతిని తాత్కాలిక ఇన్‌చార్జ్ ఏసీపీగా నియమించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఆమెనే పర్మినెంట్ ఏసీపీగా నియమిస్తారా? లేక బదిలీపై మరొకరిని తీసుకువస్తారా? అనేది అధికార వర్గాల్లో ప్రశ్నగా మారింది.

ఈ సర్కిల్ పరిధిలో అనుమతుల్లేని పలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉండటం, టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇదే సమయంలో అధికారుల వాస్తు భయం.. ప్రజలతో పాటు అధికారుల్లోనూ అనుమానాలు పెరుగుతున్నాయి.

Next Story