- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిర్సపల్లి ‘డంపింగ్’ సెగలు.. హుజూరాబాద్‌ను గ్యాస్ ఛాంబర్‌గా మారుస్తారా
హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి వద్ద ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్) నిర్మాణంపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణ శివారులోని సిర్సపల్లి వద్ద ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్) నిర్మాణంపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పుపై అవగాహన కల్పించేందుకు అఖిలపక్ష కమిటీ గురువారం ఉదయం స్థానిక హైస్కూల్ మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు పలకల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ మొండిగా ముందుకు వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ పేరుతో హుజూరాబాద్‌ను మరో 'గ్యాస్ ఛాంబర్'గా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్లాంట్ వల్ల వెలువడే వ్యర్థాలతో భూగర్భ జలాలు విషతుల్యమవుతాయని, ఫలితంగా భావితరాలు భయంకరమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్లాంట్ ఏర్పాటు వల్ల భూసారం దెబ్బతిని పంటలు పండవని, ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో అల్లాడాల్సి వస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతమంతా రోగాల నిలయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యమానికి వాకర్స్ జై..
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో తాము అఖిలపక్షంతో కలిసి నడుస్తామని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రజాసంఘాల నేతలు మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, కొలిపాక సమ్మయ్య, వేల్పుల రత్నం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కొన్నే రాజిరెడ్డి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డిష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తక్షణమే విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.






