ఇంతకు చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?

by Dishanational1 |
ఇంతకు చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
X

దిశ, రామడుగు: ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తుంటాయి. చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ ప్రతిసారి కొత్త ముఖం తెరపైకి వస్తుంది. గతంలో ఎమ్మెల్యే బొడిగె శోభకు కేటాయించిన ఈ టికెట్టు తదుపరి ఎన్నికలలో గందరగోలాల నడుమ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకుల అండతో భారీ విజయాన్ని చేజిక్కించుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం సీఎం సర్వేలో కొందరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టమే అని తేలడంతో 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆశావాకులు బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నాయి. అందులో చొప్పదండి, ధర్మపురి, మానకొండూర్ నియోజకవర్గం ఎస్సీ వర్గానికి కేటాయించారు. చొప్పదండి నియోజకవర్గంలో 2018లో సుంకే రవిశంకర్ కు బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందినప్పటి నుండి నేటి వరకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కోట్లాది రూపాయలతో పట్టువదలని విక్రమార్కుని లాగా నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు.

పొద్దు పొడుపు కార్యక్రమంతో ప్రజల్లోకి.....

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో పొద్దు పొడుపు కార్యక్రమం చేపట్టి స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నారు. చెక్కులతోపాటు ఎమ్మెల్యే సతీమణి దీవెన సొంత ఖర్చులతో ఆడపడుచులకు చీరలను ఎమ్మెల్యే రవిశంకర్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కూడా చేపట్టని ఈ విధంగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పొద్దుపొడుపు కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంకు వెళ్లి ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతున్నారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే టికెట్ కేటాయిస్తారని ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిట్టింగ్ స్థానంతోపాటు స్థానికత కలిసి వస్తుందని ధీమాతో ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నారు.



తెరపైకి కొత్త ముఖాలు......

చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ రేసులో మరి కొంతమంది స్థానికేతర నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మంత్రి గంగుల అనుచరుడుగా పేరుపొందాడు. శ్రీనివాస్ రెండు పర్యాయాలు కార్పొరేటర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో పలువురితో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు గజ్జలకాంతం పోటీ పడుతున్నాడు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి ఈసారి చొప్పదండి టికెట్ తనకే ఇవ్వాలని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున చొప్పదండికి టికెట్ ఆశించినప్పటికీ టికెట్ కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్ లో చొప్పదండి టికెట్ కోసం వేట మొదలుపెట్టారు. ఇక ఇదే పెగడపల్లి మండలానికి చెందిన ఇరుగురాల ఆనంద్ తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతూ ఉన్నారు. గతంలో పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మండల జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ లో చేరినప్పటి నుండి కొప్పుల ఈశ్వర్ కు నమ్మిన బంటుగా ఉన్నారు. కొప్పుల ఈశ్వర్ చొరవతో టికెట్ ఆశిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బోయినపల్లి మండల జెడ్పీటీసీగా ప్రస్తుతం పదవిలో ఉన్న కత్తెరపాక ఉమా భర్త కత్తెరపాక కొండయ్య కూడా రాజ్యసభ సభ్యులు జోగిని పెళ్లి సంతోష్ కుమార్, మంత్రి కేటీఆర్ చొరవతో పలుమార్లు టికెట్ కోసం ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ అత్తగారి మండలమైన బోయినపల్లి కావడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ చొప్పదండి భారత రాష్ట్ర సమితి పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయిస్తానని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ మళ్లీ చొప్పదండి నియోజకవర్గంలో సర్వేలు ఇప్పటికే రెండుసార్లు చేయించారు. మళ్లీ మరో వారం రోజుల లోపు మరొకసారి చేయిస్తానని సీఎం కేసీఆర్ చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు టికెట్ కేటాయిస్తారా లేక మరి కొంతమంది టికెట్ వేటలో ఉన్న నాయకులలో ఎవరికైనా ఒకరికి ఇచ్చే అవకాశం ఉందా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఎవరికీ కేటాయిస్తారోనని గ్రామాలలో ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మరి గులాబీ నేత కేసీఆర్ టికెట్ కేటాయించేంతవరకు వేచి చూడక తప్పదు.


Next Story

Most Viewed