సీఎంఆర్ఎఫ్ చెక్కుల అసలు దొంగలు ఎవరు?

by Ratna Kumari |

సీఎంఆర్ఎఫ్ ప‌థ‌కం పేద‌ల‌కు రోగంలా.. పెద్ద‌ల‌కు వ‌రంలా మారింది. పార్టీ నేత‌ల‌కు ఇది ఓ ఆదాయంగా మార‌డం విశేషం.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల అసలు దొంగలు ఎవరు?
X

దిశ, శంకరపట్నం : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి పేద ప్రజలు పెద్ద ఆసుపత్రులలో కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్నప్పుడు ఆర్థికంగా వారిని ఆదుకునేందుకు ఆసుపత్రిలో అయిన ఖర్చులో కొంత మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా అందించే పథకమే సీఎంఆర్ఎఫ్.ఈ పథకం పేద ప్రజలకు గొప్ప వరం. కానీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకు, బడా బాబులకు, పార్టీ నేతలకు ఆదాయం మార్గంగా మారింది. పేదల రోగం పెద్దలకు వరంగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది.

కలకలం రేపుతున్న సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారం..

శంకరపట్నం మండలంలోని కొన్ని గ్రామాలలో గతంలో సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ఆస్పత్రి బిల్లులతో సహా దరఖాస్తు చేసుకున్న కొంతమందికి తమ పేర్ల పై వచ్చిన చెక్కులను వేరే ఎవరో బ్యాంకుల నుండి డబ్బులు విత్డ్రా చేసుకున్నారని బాధితులు ఆరోపించారు. నాయకుల బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో అసలైన లబ్ధిదారులకు కొంత డబ్బు చెల్లించి చేతులు దులుపుకున్న సందర్భం ఉంది.

అనామకుల ఖాతాల్లోకి సీఎంఆర్ ఎఫ్ చెక్కుల మళ్లింపు

ఓ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు తన గ్రామానికే చెందిన ఓ వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కాకున్న ఓ మహిళా సంఘం మహిళ తో అదే పేరుతో ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ చేసుకొని తర్వాత డబ్బులను విడిపించుకున్నట్లు సదరు వ్యక్తి వాపోయాడు.వాస్తవానికి అతను రోగి కాదు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోలేదు.పేరు ఒక్కటే కావడం తో చాకచక్యంగా చెక్కును ఖాతాలో వేయించి డబ్బులు విడిపించుకున్నట్లు వాపోయాడు.

అక్రమార్కులకు అధికారుల అండ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల గల్లంతుపై ఓ వైపు విజిలెన్స్,పోలీస్ అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. నకిలీ లబ్ధిదారునికి చెక్కు ఇచ్చి విత్ డ్రా చేయించడంతో నకిలీ లబ్ధి దారునికి విజిలెన్స్ అధికారులు ఫోన్ చేసి సీఎంఆర్ఎఫ్ చెక్కుకు సంబంధించిన వివరాలను అడగడంతో కంగుతిన్నట్లు సమాచారం. ఈ నోట ఆ నోట ముఖ్య నాయకునికి తెలియడంతో అధికారులు ఎవరూ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి వాకబ్ చేయవద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది.దీనితో అధికార యంత్రాంగం కూడా గప్ చుప్ గా ఉందని మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది.

అసలు దొంగలు దొరికేనా..?

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అసలు లబ్ధిదారులకు కాకుండా కొన్ని చెక్కులు దారి మళ్లించిన సంఘటనలు మండలంలో గతంలోనే వెలుగులోకి వచ్చాయి. అయినా వాటి విషయంలో నేటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం విస్మయం కలిగిస్తుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై సమగ్ర విచారణ జరిపి అసలైన ల‌బ్ధిదారులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Next Story