వీరభద్ర స్వామి జాతరలో అపశృతి

by Ratna Kumari |

గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది.

వీరభద్ర స్వామి జాతరలో అపశృతి
X

దిశ, గంగాధర : గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జాతరలో భాగంగా ఆదివారం నిర్వహించిన సంప్రదాయ ఎడ్ల బండ్ల పరుగు సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కోట్ల నరసింహులపల్లిలో వీరభద్ర స్వామి ఆలయ వార్షిక జాతరను గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించారు. ఆదివారం గ్రామంలో సంప్రదాయ ఎడ్ల బండ్ల పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎడ్ల బండ్ల పరుగు జరుగుతున్న సమయంలో సర్వారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు వినోద్ అనే యువకుడు వీడియో చిత్రీకరిస్తూ ట్రాక్‌కు సమీపంలో నిలబడ్డాడు. ఈ క్రమంలో వేగంగా దూసుకొస్తున్న ఎడ్ల బండి అదుపుతప్పి అతడిని ఢీకొట్టింది. దీంతో వినోద్ నేలకూలి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అతడిని అక్కడి నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువకుడి తల, ఛాతి భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వినోద్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story