- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల మెప్పుకు తంటాలు.. అయోమయంలో అభ్యర్థులు
శంకరపట్నం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది.

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల పర్వం ముగిసిపోవడంతో గుర్తులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఆశావహ అభ్యర్థులు గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఓటర్లను మచ్చిక చేసుకొని మనసు మార్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కులం కార్డు గట్టెక్కించేనా?
పైకి కులాన్ని చూసి ఓట్లు వేయమని చెబుతున్న ఓటర్ల మనసంతా మనోడైతేనే బాగుంటది వేరేవాడు అయితే ఎలా? మంచోడైన చెడ్డోడు ఐనా మనవాణ్ణి మనమే గెలిపించుకుందాం అని గ్రామీణ ప్రాంతాల్లోని కుల పెద్దలు, కుల సంఘాల నాయకులు రహస్య సమావేశాలు నిర్వహిస్తూ సర్పంచి పదవిని బయటి కులానికి, వ్యక్తులకు అప్పగించవద్దని తీర్మానాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో రిజర్వ్ స్థానాలు మినహా జనరల్, జనరల్ మహిళ స్థానాల్లో కులాధిపత్యం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పండితులు చెబుతున్నారు.
అణుకువే ఆభరణం
మాకేం తక్కువ అంతా మేమే.. అంతా మాదే మా ఇష్టారాజ్యం అని విర్రవీగిన కొంతమందికి ఈ ఎన్నికలు చెంపపెట్టుగా మారుతాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. సర్పంచులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గతంలో వ్యవహరించిన తీరు కూడా వారి గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశం మెండుగా ఉందంటున్నారు. ముఖ్యంగా ఆర్భాటాలు చేసే వ్యక్తుల కంటే అణుకువగా ఉండే వ్యక్తులను, నలుగురితో కలిసి ఉండే వ్యక్తులను అక్కున చేర్చుకునే అవకాశాలే ఎక్కువ. అంతేకాకుండా గతంలో గ్రామంలో వివిధ పంచాయతీలలో వారు వ్యవహరించిన తీరు న్యాయం వైపు నిలబడ్డారా అన్యాయం వైపు నిలబడ్డారా.. రేపు సర్పంచిగా ఎన్నికైతే ఒకవేళ న్యాయం చేయగలుగుతాడా అనే కోణాలలో ఆలోచిస్తున్నట్లు తెలిసింది. గ్రామంలో వైషమ్యాలు పెంచి పోషించే వారిని అసలే ఎన్నుకోవద్దని, దీంతో గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని నలుగురు చేరిన చోట చర్చించుకుంటున్నారు.
ఎవరిని నొప్పించని ఓటర్లు
ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనని తమ దగ్గరికి వచ్చే సర్పంచ్ అభ్యర్థులకు అన్నా మీకే ఓటేస్తాం.. మీరేం కంగారు పడకండి మీ పని మీరు చేసుకోండి తప్పకుండా మీకే వేస్తాం.. మీరే గెలుస్తారు అని భరోసా ఇస్తున్నారు. చివరికి ఎవరికి ఓటేస్తారోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో పలు గ్రామాల్లో ఊరి అభివృద్ధి కోసం కృషి చేస్తామని అభ్యర్థులు వాగ్దానాలు చేస్తున్నారు.
ఖర్చు పెడితేనే కుర్చీ
నువ్వు ఎన్నైనా చెప్పన్నా అభ్యర్థి గుణగణాలు 50 శాతం మిగతా 50 శాతం డబ్బు పంచకుంటే గెలవడం కష్టమేనన్న అని గ్రామస్తులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు ఆర్థిక వనరుల వేటలో పడ్డారని తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి ధాన్యం అమ్మకాలు ముగియడంతో చుట్టాలు, బంధువుల వద్ద స్నేహితుల వద్ద అప్పులు చేస్తూ ఆ డబ్బులతో ఓటర్లకు కావలసిన సరుకు సరంజామాను చేరవేస్తున్నారు. గతంలో పల్లెల్లో డబ్బుతో సంబంధం లేకుండా ఏదో కొంతమందికి మద్యం సరఫరా చేసే పరిస్థితి ఉండేది. కానీ నేడు గ్రామంలో ఉన్న ఉన్నత వర్గాలు కూడా డబ్బు, మద్యం మాకు అందలేదని ప్రశ్నించే రోజులు వచ్చాయని వాపోతున్నారు. దీంతో ఈ ఎన్నికలు ఖరీదుగా మారాయని అంటున్నారు.
అధికార పార్టీ అభ్యర్థుల భరోసా
అధికార పార్టీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మా ప్రభుత్వమే అధికారంలో ఉంది. నీకు సంక్షేమ పథకమైన, ఇంకేదైనా సహాయం కావాలంటే క్షణాల్లో చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. ఇక మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా తమకు తోచిన విధంగా అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.






