కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయానికి భారీ గండి

by Dishanational1 |
కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయానికి భారీ గండి
X

దిశ, మల్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించుకునే దుకాణాల టెండర్ విషయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. మార్చి 9న టెండర్లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. దుకాణాలను దక్కించుకోడానికి వచ్చిన కొంతమంది సెక్యూరిటీ డిపాజిట్ చూపించలేదని టెండర్లు దాఖలు చేసినవారి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. అయితే అధికారులు టెండర్ ప్రక్రియను వాయిదా వేసి గురువారం రోజు నిర్వహించారు. గురువారం నిర్వహించిన టెండర్ లలో కొంతమంది దరఖాస్తుదారులు ఎలాగైనా టెండర్లు దక్కించుకోవాలని సిండికేట్ గా ఏర్పడినట్లుగా స్పష్టమవుతుంది. గత సంవత్సరానికి అంటే 20% ఆదాయం టెండర్ల ద్వారా అధికంగా రావాల్సి ఉండగా అంచనా ప్రకారం ఆదాయం రాకుండా పోయినట్లుగా తెలుస్తుంది. అయితే టెండర్లు వాయిదా పడిన రోజు నుండి వారం రోజులు గ్యాప్ ఉండడంతో టెండర్లు దాఖలు చేసేందుకు ఎవరు ఆసక్తిగా ఉన్నారని చూసుకుని సిండికేట్ గా ఏర్పడడంతోనే అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

బినామీ పేర్లతో టెండర్లు??

గత సంవత్సరం టెండర్లు దక్కించుకున్న కొంతమంది చెల్లించాల్సి ఉన్న డబ్బులు పూర్తిస్థాయిలో కట్టలేదని సమాచారం. అయితే మరోసారి టెండర్లలో పాల్గొనేందుకు బకాయి ఉన్నవారికి అవకాశం లేకపోవడంతో బినామీ పేర్లతో టెండర్లు దాఖలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ వారిచ్చే ముడుపులకు ఆశపడి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ఏ వ్యాపారానికి ఎంత సొమ్ము లభించిందని 14 రకాల వ్యాపారాలకు గాను ఏవీ పూర్తి అయినాయి ఏవీ పెండింగ్లో ఉన్నాయన్న సమాచారాన్ని పూర్తిస్థాయిలో బయటకు వెల్లడించకపోవడం, గత సంవత్సరానికి గాను టెండర్ దారులు పూర్తిగా సొమ్మును ఇచ్చారా? ఆ సొమ్ము పూర్తిస్థాయిలో అందకముందే ఈ టెండర్ ప్రక్రియ ఎలా మొదలుపెట్టారు అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు కొబ్బరికాయలకు సంబంధించిన అమ్మకం, కొనుగోలు సంవత్సరం కాలానికి గాను పెద్ద ఎత్తున లావాదేవీ జరుగుతున్నా ఏ ఒక్క టెండరుదారు తన లైసెన్స్ పేరు మీద జీఎస్టీ పన్ను చెల్లించిన దాఖలాలు లేవని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు 14 రకాల వ్యాపారాలకు గాను మరో మూడు రకాల టెండర్లు వాయిదాలు ఉన్నట్టు వాటిని కూడా వారం రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది. ఇట్టి టెండర్ ప్రక్రియను గమనిస్తున్న భక్తులు, ప్రజలు అధికారుల తీరుపై టెండర్ దారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.


Next Story

Most Viewed