మూగబోయిన బీఎస్ఎన్ఎల్...

by Dishanational1 |
మూగబోయిన బీఎస్ఎన్ఎల్...
X

దిశ, కరీంనగర్​బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీఎస్ఎన్ఎల్​ఫోన్లు నాలుగు రోజులుగా మూగబోవడంతో ఎవ్వరి పనులు ముందుకు సాగడం లేదు.. మందకొడిగా సాగుతున్న బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ పనులతో సిగ్నల్ రావడానికి మరింత సమయం పట్టేలా ఉంది. అగ్ని ప్రమాదంలో కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలోని సుమారు 3 లక్షల మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు అందించిన సేవలు అన్నీ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తిగా కాలిపోయింది. విద్యుత్​షార్ట్​సర్కూట్​తో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు బీఎస్ఎన్ఎల్ అధికారులు. అగ్ని ప్రమాదంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ల్యాండ్​ఫోన్లు, బ్రాడ్ బ్యాండ్​సేవలు, ఫైబర్ సేవలతో సెల్ ఫోన్​సిగ్నల్ సైతం పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్​బీఎస్ఎన్ఎల్​కార్యాలయం పరిధిలోని నాలుగు జిల్లాల్లో 3724 ల్యాండ్​ ఫోన్లు, 6,751 ఫైబర్ టూ హోం కనెక్షన్లు, 79 ఓఎల్​టీటీలు 2,61,515 సెల్​ఫోన్ ప్రీ పెయిడ్​ వినియోగదారులతోపాటు 1,270 మంది సెల్​ఫోన్​పోస్ట్​పెయిడ్​కస్టమర్లు ఉన్నారు. అగ్ని ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీసులోని అన్ని పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో ప్రస్తుతం నాలుగు జిల్లాలకు బీఎస్ఎన్ఎల్​ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

పునరుద్ధరణ పనుల్లో అధికారులు...

కరీంనగర్​బీఎస్ఎన్ఎల్​కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్​సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో అధికారులు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. అగ్ని ప్రమాదంతో ల్యాండ్​లైన్, ఫైబర్ టూహోం, ఫ్రీ పెయిండ్​సెల్​ఫోన్ సిగ్నల్​సిస్టమ్, పోస్ట్ పెయిడ్​సిస్టమ్​పూర్తిగా దగ్ధమయ్యాయి. కరీంనగర్ బీఎస్ఎల్ఎన్​కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి బీఎస్ఎన్ఎల్ వరంగల్​జీఎం చంద్రమౌళి, కరీంనగర్​ డీజీఎం దినేష్​ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు కావాల్సిన పరికరాలు రావడం ఆలస్యం అవుతుందని భావించిన ఆఫీసర్లు పొరుగు జిల్లాలో అందుబాటులో ఉన్న పరికాలను తెప్పించి ఒక్కో సర్వీస్​ను సరి చేస్తున్నారు.

ముందుకు సాగని పనులు...

ఈ నెల 22వ తేదీ రాత్రి నుంచి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఎస్ఎన్ఎల్​సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో సుమారుగా 3 లక్షల మంది వినియోగదారుల పనులు ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్​లేకపోవడంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులతోపాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల ఫోన్లు మూగబోయాయి. వీరిలోపాటు బీఎస్ఎన్ఎల్ సేవలు వినియోగించుకుంటున్న వ్యాపారులు, సాధారణ ప్రజల పనులు సైతం ముందుకు సాగడంలేదు.

రేపటిలోగా పునరుద్ధరణ పేరుతో బోర్డు...

అగ్ని ప్రమాదంలో ఆహుతైన కరీంనగర్​బీఎస్ఎన్ఎల్​ఆఫీసులో కాలు పెడితే చాలు ఎటు చూసినా కాలిన వస్తువులే దర్శనం ఇస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ప్రధాన గేటుకు మాత్రం సాంకేతిక కారణాలతో బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోయాయి. రేపటి నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని బోర్డు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆఫీసు లోపలికి వెళ్లి పరిశీలిస్తే మాత్రం మరోవారం రోజులు పట్టేటట్లు కనిపిస్తుంది. కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కావాలంటే మరోకొన్ని రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు వినియోదారుల పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు.


Next Story