- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిర్సపల్లి డంప్ యార్డ్‌ను వెంటనే రద్దు చేయాలి
హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదిత డంప్ యార్డ్ ఏర్పాటును వెంటనే రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసనలు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. సిర్సపల్లి డంప్ యార్డ్ రద్దు చేయాలని కోరుతూ హుజురాబాద్ ప్రాంత ప్రజలు, జేఏసీ నాయకులు, వివిధ ప్రజాసంఘాలు గత కొంతకాలంగా నిరసనలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఇంతలా ఉద్యమించి నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం బాధాకరమన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ, పర్యావరణానికి హాని కలిగించే విధంగా డంప్ యార్డ్ ఏర్పాటుకు ప్రయత్నించడం ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక చర్యేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కాలుష్య కోరల్లో గ్రామాలు..
చెత్త నుంచి వెలువడే విషపూరిత వాయువుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని,ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. పరిసర గ్రామాల్లోని గాలి, నీరు, భూమి పూర్తిగా కాలుష్యమయంగా మారుతాయని, భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు సాగుకు పనికిరాకుండా పోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది..?
హుజురాబాద్ ప్రజల ఆవేదనను, జేఏసీ విన్నపాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల తరఫున ఎన్నోసార్లు ప్రభుత్వ పెద్దలకు, అధికార యంత్రాంగానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ.. ఇంతవరకు స్పష్టమైన జీవో కానీ అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. "ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని డంప్ యార్డ్ కోసం గుర్తించాలి." అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
ఉధృత ఉద్యమానికి హెచ్చరిక
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంప్ యార్డ్ రద్దుపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాసంఘాలను కలుపుకొని భవిష్యత్తులో మరింత ఉద్ధృతమైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.






