'దేశభక్తి' చాటుతూ.. 'భద్రత'కు బాట!

by Ratna Kumari |

మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దేశభక్తి చాటుతూ.. భద్రతకు బాట!
X

దిశ, గంగాధర : మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో దేశభక్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిత్య "జనగణమన", రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం నిర్ణీత సమయానికి జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా ప్రజల్లో దేశభక్తి భావం పెరుగుతుందని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. దీంతో పాటు నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేర్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి ఆయన రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను నిబంధనల ప్రకారం పాటించాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఎస్సై సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో వ్యవహరించి, గ్రామంలో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. గ్రామ కూడలి వద్ద ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం పై బూరుగుపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దేశభక్తిని చాటుతూనే, ప్రాణాలను కాపాడుకునేలా అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story