బరితెగిస్తున్న రియల్ మాఫియా.. "అడిగితే ఆరెకరాలు మింగుతా"

by Naga Rani Yarlagadda |

జమ్మికుంట పట్టణ శివారులోని ధర్మారం భూముల్లో రియల్ మాఫియా కోరలు చాస్తోంది.

బరితెగిస్తున్న రియల్ మాఫియా.. అడిగితే ఆరెకరాలు మింగుతా
X

దిశ, ​జమ్మికుంట టౌన్: జమ్మికుంట పట్టణ శివారులోని ధర్మారం భూముల్లో రియల్ మాఫియా కోరలు చాస్తోంది. 'అంజన టౌన్‌షిప్' పేరిట వెలసిన ఓ అక్రమ వెంచర్ ఏకంగా ప్రభుత్వ భూమినే మింగేసింది. అధికారుల ఆశీస్సులు, రాజకీయ నాయకుల అండదండలతో సర్కార్​ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు అప్పనంగా దోచుకుంటున్నా.. యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​​సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అంజన టౌన్‌షిప్‌లో చట్టాలకు, నిబంధనలకు అస్సలు తావు లేకుండా పోయింది. సర్వే నంబర్ 9293లలో ఉన్న సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకొని యథేచ్ఛగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కలిగిన రెవెన్యూ అధికారులు, కబ్జా జరుగుతున్నా కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున 'మామూళ్ల' మతలబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

​రియల్టర్ అహంకారం..

​ప్రభుత్వ భూమిని ఎలా ఆక్రమిస్తారని ప్రశ్నించిన సామాన్యులపై వెంచర్ యజమాని అహంకారంతో విరుచుకుపడుతున్నారు. ‘రెండు ఎకరాలే కాదు.. ఆరు ఎకరాలు స్వాధీనం చేసుకున్నా.. నీకేమైనా ఒక ఎకరం కావాలా? అంటూ ఎదురుదాడికి దిగడం చూస్తుంటే, చట్టాలంటే ఈ రియల్ మాఫియాకు ఎంత చులకన భావముందో అర్థమవుతోంది. ఇంతటి బరితెగింపు వెనుక ఏ రాజకీయ పెద్దల హస్తం ఉందో విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు బేఖాతరు

​ఈ అక్రమ వెంచర్ నిర్వాహకులు నిబంధనలను కాలరాయడంలో ఆరితేరిపోయారు. టౌన్‌షిప్ మధ్యలో ఉన్న బాటను ఆక్రమించి ప్రహరీ నిర్మించగా, ప్రజల ఒత్తిడితో అధికారులు మొక్కుబడిగా కేవలం గోడను మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారు. ​లేఅవుట్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి అప్పగించాల్సిన 10 శాతం భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయకుండానే అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం.​ సర్వే నంబర్ 9293లోని మిగిలిన 72 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటానికి తక్షణమే సరిహద్దులు నిర్ణయించి కంచె వేయాలని స్థానికులు కోరుతున్నారు. ​​కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతుంటే మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం చిన్నపాటి చర్యలతో సరిపెట్టకుండా, ఆక్రమణకు గురైన రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఈ భూ దోపిడీపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, అక్రమాలకు పాల్పడిన రియల్టర్లపై, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మారం గ్రామస్తులు విన్నవిస్తున్నారు.

Next Story