ఫీజులు బారెడు.. చదువు మూరెడు..

by Naga Rani Yarlagadda |

జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం స్కూల్స్‌పై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఫీజులు బారెడు.. చదువు మూరెడు..
X

దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం స్కూల్స్‌పై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ, విద్య నాణ్యతను నిర్లక్ష్యం చేస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణం బురదమయంగా, అపరిశుభ్రంగా ఉండడంతో పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. స్కూల్‌కు ప్లే గ్రౌండ్‌ లేదని, విద్యార్థులను రోడ్డుపై ఆటలాడించడం వారి భద్రతకు ముప్పు కలిగిస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, కండిషన్ సరిగ్గా లేని పాత ఏపీ నంబర్‌ బస్సులను నడుపుతూ భద్రతను విస్మరించారు. అనుభవం లేని డ్రైవర్లతో పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకుంటున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యంపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

విద్యను వ్యాపారంగా మార్చుకుని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం స్కూల్స్ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, నాణ్యమైన విద్య వంటి ప్రాథమిక అంశాలను కూడా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ చదువును కేవలం డబ్బు సంపాదించే మార్గంగా మార్చుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చదువు సారేడు బలపాలు దోసాడు’ అన్నట్లుగా, విద్య నాణ్యత అంతంత మాత్రంగా ఉన్నా ఫీజులు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

అనారోగ్యకర వాతావరణం..

న్యూ మిలీనియం స్కూల్ ప్రాంగణంలో నెలకొన్న అపరిశుభ్రత పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. కొద్దిపాటి చిరుజల్లుకే స్కూల్ ప్రాంగణం మొత్తం బురదమయం అవుతోంది. దీనివల్ల పిల్లలను దింపడానికి వస్తున్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బురద కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, విద్యార్థులకు జ్వరాలు, చర్మ వ్యాధుల వంటి సమస్యలు వస్తున్నాయని వారు ఆరోపించారు.

ప్లే గ్రౌండ్‌పై నిర్లక్ష్యం..

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ స్కూల్లో ప్లే గ్రౌండ్ కూడా లేదు. దీంతో విద్యార్థులను స్కూల్ ఎదుట గల రోడ్డుపై ఆటలాడిస్తున్నట్లు వాపోతున్నారు. ఇది పిల్లల భద్రతకు ఏ మాత్రం మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

కండిషన్ లేని బస్సులు..

విద్యార్థుల భద్రత విషయంలో న్యూ మిలీనియం స్కూల్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. బస్సుల కండీషన్ సరిగా లేకపోవడం, ఏపీ నంబర్‌తోనే ఇంకా బస్సులు నడుపుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, సరైన అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారని, అంతేకాక బస్సులో పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని తల్లిదండ్రులు గుర్తు చేస్తున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

అధికారులు తక్షణమే స్పందించి న్యూ మిలీనియం స్కూల్స్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, పిల్లల ఆరోగ్యం, భద్రతకు భరోసా కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు వాపోతున్నారు.

Next Story