- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు దించేదే లే.. లారీల నిలిపివేతతో ప్రజల అవస్థలు
వీణవంక మండలంలోని చల్లూర్ ఇసుక రీచ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా స్థానిక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీణవంక మండలంలోని చల్లూర్ ఇసుక రీచ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా స్థానిక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీచ్ సమీపంలో ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో ఇసుక తరలింపునకు వచ్చే వందలాది లారీలను కరీంనగర్ - జమ్మికుంట ప్రధాన రహదారిపైనే అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా ఆర్టీసీ బస్సుల సేవలు కూడా నిలిచిపోతున్నాయి. లారీలు అడ్డుగా ఉండడంతో బస్సు డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మార్గమధ్యలోనే దించేస్తున్నారు. లారీ యజమానులు ‘రోడ్డు దించేది లేదు’ అంటూ మొండిగా వ్యవహరిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు రీచ్ నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని, అందుకే ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తక్షణమే పార్కింగ్ సమస్యను పరిష్కరించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
దిశ, కరీంనగర్ బ్యూరో : ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెండర్లలో ఇసుక రీచ్‌ను నిర్వహించేందుకు టెండరు దక్కించుకున్న రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రీచ్‌ను నిర్వహిస్తుంటే పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారుతుంది. స్థానికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇసుకను తరలించాల్సిన రీచ్ నిర్వాహకులు రీచ్ సమీపంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడంతో దారి పొడవునా తరలించేందుకు వచ్చే లారీలను పార్కింగ్ చేస్తున్నారు రోడ్డుపై లారీల పార్కింగ్‌తో దారి పోడవునా ఉన్న గ్రామాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. లారీలను తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నా చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతోంది.
రోడ్డు దించేది లేదు...
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూర్ రీచ్‌కు వచ్చే లారీలు నిబంధనలకు విరుద్ధంగా లారీలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. దీంతోపాటు అడ్డదిడ్డంగా రోడ్డుపై లారీలను నిలపడంతో రోడ్డు వెంట ఇతర వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది. లారీలతో పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను సైతం రద్దుచేసే పరిస్థితి నెలకొన్నది. పలు సందర్బాల్లో బస్ డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకుండా మధ్యలోనే దింపిన పరిస్థితి నెలకొన్నది. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టకపోవడంతో ఇదే అదనుగా తీసుకుంటున్న లారీ యజమానులు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి రోడ్డు దించేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు
పార్కింగ్ ఏర్పాటుకు మీనమేషాలు...
ఇసుక రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రీచ్ నిర్వహణ పర్యవేక్షించాల్సిన అధికారులు రీచ్ యజమానులు ఇచ్చే కరెన్సీ నోట్లకు అలవాటు పడి అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తుండగా స్థానికుల అవస్థలను పెడచెవినా పెడుతున్నారు. ఇసుక తరలించేందుకు వచ్చే లారీలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసేందుకు రీచ్ నిర్వాహకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో అధికారుల చేతివాటం, నిర్వాహకుల నిర్లక్ష్యం మానేరు పరివాహక ప్రాంత ప్రజలతోపాటు రహదారి పోడవున ఉన్నా గ్రామాల ప్రజలకు శాపంగా పరిణమించిందని స్థానికులు వాపోతున్నారు.
లారీల సమస్య పరిష్కరించేది ఎవరు?
ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రహదారి వెంట ఉన్న గ్రామ ప్రజలు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు లారీలను తొలగించాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై స్థానికుల రవాణాకు అవకాశం లేకుండా ఇబ్బందికరంగా లారీలను పార్క్ చేస్తుంటే అరికట్టే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు రోడ్లపై వాహనాలు నిలిపితే ఫొటోలు తీసి ఫైన్లు వేసే పోలీసులు ప్రజలు లారీలతో అవస్థలు పడుతుంటే పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక తహశీల్దారు సైతం ఇసుక రీచ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గమ్యం చేరని ఆర్టీసీ బస్సులు...
కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిపై ఇసుక లారీల పార్కింగ్‌తో పలు గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు అర్థాంతరంగా మధ్యలోనే ప్రయాణికులను దింపి వెనుదిరుగుతున్నాయి. లారీల పార్కింగ్ తో బస్ ముందుకు వెళ్లలేక ప్రయాణికులను గమ్య స్థలానికి చేరకుండానే దింపడంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు ఇసుక రీచ్ నిర్వాహకుల తీరుపై దుమ్మెత్తి పోస్తు ఇసుక లారీలతో మాకు ఇవేం బాదలు అంటు ఈసడించుకుంచున్మారు. అధికారులు ఇసుక లారీల పార్కింగ్ పై చర్యలు చేపట్టకపోతే ఇక మీదట పల్లెలకు ఆర్టీసీ బస్సు సేవలు అందడం గగనమేనని వాపోతున్నారు.






