- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిశ్రమల పొగ, బొగ్గు ధూళితో అల్లాడుతున్న రామగుండం ప్రాంతం ప్రజలు
రామగుండంలో కోరలు చాస్తున్న కాలుష్యం.. బొగ్గు ధూళి, ఎన్‌టీపీసీ పొగతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న జనం.. గ్రీన్ బెల్ట్ నిర్మించాలని నిపుణుల సూచన!

దిశ, గోదావరిఖని : పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నా, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో మాత్రం కాలుష్య సమస్య రోజురోజుకూ కోరలు చాస్తోంది. ఒకవైపు సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులు, మరోవైపు ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ వంటి భారీ పరిశ్రమల నుంచి వెలువడుతున్న పొగ, ధూళి, బూడిద స్థానికుల ఊపిరి తీస్తున్నాయి. రామగుండం, గోదావరిఖని, జ్యోతినగర్ పరిసరాల్లో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. బొగ్గు తవ్వకాల సమయంలో ఎగిసిపడే బొగ్గు పొడి, థర్మల్ విద్యుత్ కేంద్రాల బూడిద కణాలు వాతావరణంలో కలవడం వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దగ్గు, ఆస్తమా, అలర్జీలు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెట్ల నరికివేత.. ప్లాస్టిక్ ముప్పు..
పారిశ్రామిక విస్తరణ పేరుతో వేలాది పెద్ద చెట్లను తొలగించడం వల్ల సహజ వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. గతంలో పచ్చదనంతో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు బొగ్గు గనులు, కాంక్రీట్ కట్టడాలు గా మారాయి. చెట్లు తగ్గిపోవడంతో గాలిలోని విషవాయువులను శుద్ధి చేసే వ్యవస్థ దెబ్బతిని గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రమైంది. దీనికి తోడు పట్టణంలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. రోడ్లు, డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల వెలువడే విషవాయువులతో కాలుష్యం రెట్టింపవుతోంది. ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసినా, క్షేత్ర స్థాయిలో అమలు శూన్యమని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.
చిన్నారులపై ఎఫెక్ట్ – ప్రభుత్వాల నిర్లక్ష్యం..
ఈ కాలుష్య కాటు చిన్నారులు, గర్భిణీలు, వృద్ధుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్కూళ్ల సమీపంలోనూ ధూళి ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. కంటి మంటలు, చర్మ సమస్యలు వేధిస్తున్నాయి. ఏటా కోట్లాది రూపాయలు పర్యావరణ పరిరక్షణ, హరితహారం కోసం ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా, నాటిన మొక్కల సంరక్షణ కరువై ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, గనుల చుట్టూ గ్రీన్ బెల్ట్ (భారీ వృక్షాల పెంపకం) ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్‌ను పూర్తిగా అరికట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడం కేవలం ప్రభుత్వాలదే కాదు ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






