- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగాధర గురుకుల ఘటన పై అధికారులు సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!
గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థులపై దాడి ఘటన పై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు.

దిశ, గంగాధర : గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థులపై దాడి ఘటన పై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యుడిగా భావిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ జై సింగ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, ఘటన జరిగిన రోజు రాత్రి విధులు నిర్వహించిన గెస్ట్ టీచర్ రమేష్, నైట్ వాచ్‌మెన్ శంకర్‌ను విధుల నుండి తొలగిస్తూ మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో 10వ తరగతి విద్యార్థులు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో 9వ తరగతి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. రాత్రి సుమారు 11 గంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు ఈ ఘటన కొనసాగినట్లు సమాచారం. ఈ సమయంలో పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన గెస్ట్ టీచర్, నైట్ వాచ్‌మెన్ ఘటనను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యంగా భావిస్తున్నారు. దాడికి తాళలేక కొంతమంది విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సహాయం కోరారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఉదయం కూడా నిర్లక్ష్యం
ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రిన్సిపాల్ జైసింగ్‌కు విద్యార్థులు జరిగిన ఘటనను వివరించినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థులను మందలించకపోవడం, గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించకపోవడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆగ్రహం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకున్నారు. అయితే పాఠశాల సిబ్బంది గేటుకు తాళం వేసి వారిని లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిబ్బంది తీరుపై తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారుల విచారణ
సమాచారం అందుకున్న తహశీల్దార్ రజిత, ఎంపీడీవో దమ్మని రాము, మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు పంపించారు.
ఆలస్యంగా స్పందనపై అసంతృప్తి
జిల్లా ఆర్‌సి ఓ అంజలి సాయంత్రం సమయంలో పాఠశాలకు చేరుకుని విచారణ నిర్వహించగా, ఉదయం జరిగిన ఘటనపై ఆలస్యంగా స్పందించడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఉదయం జరిగిన సంఘటనపై వెంటనే స్పందించకుండా సాయంత్రం విచారణకు రావడం ఎందుకు?” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.
చర్యలు తప్పవు : ఆర్‌సీఓ అంజలి
పాఠశాలలో జరిగిన ఘటన పై సమగ్ర విచారణ నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆర్‌సీఓ అంజలి తెలిపారు. బాధ్యులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలతో గురుకుల పాఠశాలల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నట్టు స్పష్టమవుతోంది.






