ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు.. ప్రాణాలే ముద్దు

by Disha Web Desk 1 |
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు.. ప్రాణాలే ముద్దు
X

పాషిగాం స్తంభంపల్లి, వెల్గటూర్ గ్రామాల ప్రజలు

దిశ వెల్గటూర్: కాలుష్యంతో ప్రజల ప్రాణాలను హరించే ఇతనాల్ ఫ్యాక్టరీ తమ ప్రాంతంలో వద్దని.. వాళ్ల ప్రాణాలే వారికి ముద్దంటూ పాషిగాం స్తంభంపల్లి, వెల్గటూర్ గ్రామాల ప్రజలు వరంగల్ రాయపట్నం రహదారిపై శుక్రవారం 5 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు మహిళలు చేసిన ఆందోళన పాషిగాం వద్ద రణరంగాన్ని తలపించింది. ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి ఇథనాల్ ప్రాజెక్టు తెచ్చి పచ్చని పల్లెల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ చిచ్చు పెడుతున్నడని వారు మండిపడ్డారు.

ఈ సందర్భంగా రైతులు, మహిళలు రోడ్డెక్కి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఈ క్రమంలో పోలీసులు రైతులు, మహిళలు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిలవగా రైతులు మహిళలు మరింత రెచ్చిపోయారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఆపుతామని, మా ఆందోళనకు అంతం కాదని.. ఆరంభం అంటూ పరిసర గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ రాస్తారోకో నిర్వహించారు.

వెల్గటూరు మండలం స్తంభంపల్లి శివారులోని సర్వే నెం.1090లోని విశాలమైన ప్రభుత్వ భూమిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకుకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్రిబ్ కో ప్రతినిధులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పాషిగాం గ్రామస్థులు అక్కడికి చేరుకొని తమకు ఇళ్లను కట్టుకోవడానికి భూమి లేదు కానీ.. ఫ్యాక్టరీ పెట్టేందుకు భూమి ఎట్ల ఇస్తారంటూ ప్రజలు మంత్రిని ప్రశ్నించారు. ఇథనాల్ వల్ల గాలి, భూమి లోని నీరు కాలుష్యమయం అవుతాయన్నారు. అక్కడ ఫ్యాక్టరీ నిర్మించవద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రజలు విజ్ఞప్తి చేశారు.

దీంతో ఆయన కాలుష్యపరంగా ఎలాంటి నష్టం ఉండదూ అంటూనే మంత్రి అక్కడ నుంచి జారుకున్నారు. అనంతరం పాషిగాం వెల్గటూర్ స్తంభంపల్లి గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రదేశానికి చేరుకొని రహదారిపై ధర్నా రాస్తారోకో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు మొదలైన రాస్తారోకో మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. ఒకానొక దశలో పోలీసులు సంయమనం కోల్పోయి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించగా మహిళలు వారిపై తిరగబడ్డారు. దీంతో రాష్ట్ర రహదారి రణరంగంగా మారింది. చరిత్రలోనే మొదటిసారి సామాన్య ప్రజలు ఇంత తెగింపుతో పోలీసులను ఎదుర్కొని 5గంటల పాటు రాస్తారోకో చేయడం సంచలనం రేపింది.

Next Story

Most Viewed