“నాన్నా… ఒక్కసారి కనిపించండి”.. సోషల్ మీడియాలో ఆడియో వైరల్

by Ratna Kumari |   (  Updated:2026-03-05 12:55:09  IST  )

జగిత్యాల జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కుమారుడు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు హృదయాలను కదిలిస్తున్నాయి.

“నాన్నా… ఒక్కసారి కనిపించండి”.. సోషల్ మీడియాలో ఆడియో వైరల్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కుమారుడు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు హృదయాలను కదిలిస్తున్నాయి. చిన్ననాటి నుంచి తండ్రిని చూడలేక పెరిగిన తన ఆవేదనను, తల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. తండ్రి కోసం ఎదురుచూస్తున్న తన మనసులోని మాటలను ఆడియో రూపంలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో గణపతి కుమారుడు ముప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి ప్రేమ తెలిసిన వారి మాటలు ఒకలా ఉంటాయని… తండ్రి ప్రేమ తెలియని వారి మాటలు మరోలా ఉంటాయని… కానీ తండ్రి కోసం ఎదురుచూస్తున్న తనలాంటి వారి మాటలు ఎలా ఉంటాయో చెప్పలేనంత బాధగా ఉంటాయని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి “నాన్న” అని పిలిచే అవకాశం కూడా రాలేదని… ఊహ తెలిసినప్పటి నుంచి తొలిసారి “నాన్న” అని ఈ ఆడియోలోనే సంబోధిస్తున్నానని చెప్పారు.

మారుమూల గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తన తండ్రి, తన మేధస్సు మరియు కృషితో పన్నెండు రాష్ట్రాలకు విస్తరించిన మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతగా ఎదిగారని గుర్తు చేశారు. “మావోయిజం అంటే గణపతి… గణపతి అంటే మావోయిజం” అన్న స్థాయికి ఎదగడం వెనుక ఎంతో కఠోర శ్రమ ఉందని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి తండ్రిని చూడాలని, తన కష్టసుఖాలను పంచుకోవాలని, తండ్రి అండలో ఎదగాలని ఎన్నోసార్లు అనిపించేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి గుర్తుకు వచ్చిన ప్రతిసారి తన హృదయం భారమైపోతుందని.. ఎన్ని దిక్కులు చూసినా తండ్రి కనిపించరని… తన హృదయ ఘోష ఆయనకు వినిపించదని బాధ వ్యక్తం చేశారు. తండ్రి లేకపోయిన లోటు తెలియకుండా తన తల్లి అన్నీ అయి పెంచిందని తెలిపారు. తల్లి ఎప్పుడూ తండ్రి గురించి ప్రేమగా మాట్లాడేదని… తండ్రితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని నిట్టూర్చేదని చెప్పారు.

తండ్రి ఎంచుకున్న మార్గం వల్ల ఇద్దరి జీవితాలు ఎడబాటుకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అజ్ఞాత జీవితం ప్రారంభించిన తర్వాత తల్లి ఎన్నో సంవత్సరాలు కన్నీళ్లతో గడిపిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఎవరికి తెలియదని అన్నారు. అయితే తండ్రి ఎంచుకున్న సిద్ధాంతాన్ని తాను ప్రశ్నించడం లేదని… దీర్ఘకాలిక పోరాటం చేయడం కూడా ఒక ఆత్మార్పణేనని పేర్కొన్నారు. విప్లవం అంటే కష్టనష్టాలతో కూడుకున్న దారేనని… అనేక మంది యోధులు తమ కుటుంబాలను వదిలి ప్రజల కోసం పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. అయితే ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే నేటి పరిస్థితులు చాలా మారిపోయాయని ఇప్పటి యువతలో అవగాహన పెరిగిందని… సమాజ మార్పులకు అనుగుణంగా ప్రపంచంతో అనుసంధానమై ముందుకు వెళ్తున్నారని చెప్పారు. తన తండ్రి వంటి నాయకుల అనుభవం, విజ్ఞానం నేటి తరానికి మార్గదర్శకంగా ఉంటే దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతుందని… కొత్త నవభారతాన్ని నిర్మించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చెప్పగలిగే స్థాయిలో లేకపోయినా… ఇది తన మనసులోని అభిలాష మాత్రమేనని తెలిపారు.

Next Story