రాజన్న సన్నిధిలో రాములోరి కల్యాణం..

by Disha Web Desk 23 |
రాజన్న సన్నిధిలో రాములోరి కల్యాణం..
X

దిశ, వేములవాడ, సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లొనే అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నులపండువగా జరిగాయి. శ్రీరామ నామ ధ్వనాలతో ముక్కోటి క్షేత్రం మారుమోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణం కొనసాగుతూ వైకుంఠాన్ని తలపించింది. కాగా ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన ఉదయం 11 గంటల 59 నిమిషలకు రాచకొండ భాను-క్రాంతి దంపతుల చేతుల మీదుగా శ్రీ స్వామి వార్ల కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించేందుకు జిల్లా ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓ వైపు కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కల్యాణ వేడుకలకు తరలివచ్చిన శివసత్తులు, జోగినిలు, హిజ్రాలు శివయ్యను కళ్యాణ మాడారు.














సందడి చేసిన హిజ్రాలు..

ఓ వైపు స్వామి వార్ల కళ్యాణం జరుగుతున్న సమయంలోనే మరోవైపు వేడుకకు తరలివచ్చిన హిజ్రాలు నెత్తిన అక్షింతలు చల్లుకుని, వారికి వారే శివయ్యను కళ్యాణం చేసుకొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. వేలాదిగా తరలివచ్చిన హిజ్రాలతో కల్యాణ ప్రాంగణం సందడిగా మారింది. గత కొన్నేళ్లుగా తాము ఇక్కడికి వచ్చి కళ్యాణ వేడుకల్లో పాల్గొంటున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివార్లను వేడుకుంటున్నట్లు పలువురు హిజ్రాలు తెలిపారు.

పట్టువస్త్రాలు సమర్పించిన అధికారులు

కల్యాణ వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఏడాది స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు సమర్పిస్తారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ ఏడాది స్వామివారికి ప్రజాప్రతినిధులకు బదులు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.




వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కల్యాణ క్రతువును తిలకించారు. స్వామి వారికి కట్నంగా రూ. 10 వేల 116 రూపాయలు సమర్పించారు. అలాగే జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్ లతో పాటు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పలువురు అధికారులు, పలువురు ప్రముఖులు సీతారాముల కళ్యాణంలో పాల్గొని, స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.


అన్నదానం ఏర్పాటు..

స్వామివారి కళ్యాణానికి విచ్చేసే భక్తులందరి సౌకర్యార్థం కల్యాణం అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పార్కింగ్ ప్రదేశంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీంతోపాటు పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం మంచినీరు మజ్జిగ పులిహోర, అరటి పండ్లు వంటి ఆహార పదార్థాలను అందించారు.


Next Story

Most Viewed