- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏప్రిల్ 3న హుజూరాబాద్ బంద్ కి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపు
హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లిలో ప్రభుత్వం ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు పై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి.

దిశ, హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లిలో ప్రభుత్వం ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు పై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న హుజూరాబాద్ పట్టణ బంద్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల వెలువడే విష వాయువులతో 20 నుంచి 30 కిలోమీటర్ల మేర గాలి, నీరు కలుషితమవుతాయని, తద్వారా శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు.
కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. గాలి, నీరు కలుషితం కావడం వల్ల పశుసంపద, వృక్షాలకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని పాడి పశువుల పాలు, మాంసం, కూరగాయలు విషతుల్యంగా మారి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. "పాడి పంటలతో సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంత ప్రజలు, కాలుష్యం భయంతో వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. గత పది రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పై ఎమ్మెల్యే మండిపడ్డారు. గురువారం ఉదయం డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 03న నిర్వహించ తలపెట్టిన హుజూరాబాద్ బంద్ కు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆగదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.






