ఇంటింటి ప్రచారంలో మంత్రి కొప్పులకు దళిత బంధు సెగ

by Disha Web Desk 23 |
ఇంటింటి ప్రచారంలో మంత్రి కొప్పులకు దళిత బంధు సెగ
X

దిశ,వెల్గటూర్ : ఇంటింటి ప్రచారాన్ని బుధవారం వెల్గటూర్ ఎస్సీ కాలనీలో మొదలు పెట్టిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దళిత బంధు సెగ అంటుకుంది. ఉదయం నుంచి ఎదురు చూస్తుండగా మధ్యాహ్నం వరకు విచ్చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ నాయకుల పలకరింపులు కార్యకర్తల స్వాగతాల మధ్యన ఆనందంగా ఇంటింటి ప్రచారాన్ని మొదలుపెట్టి దళిత కాలనీలో అడుగుపెట్టగానే ఖంగుతిన్నారు.దళిత కాలనీలో అడుగుపెట్టిన మంత్రిని ఓ యువకుడు పేదోళ్లకు దళిత బంధు ఇయ్యరా, ఉన్నోళ్ళకే ఇస్తారా.. రెండు లక్షలు కమిషన్ ఇస్తేనే దళిత బంధు వస్తదని మీ నాయకులు అంటున్నారు. ,మేము ఎక్కడి నుంచి తెచ్చేది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి లక్షల కొద్ది డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి మీకు కమిషన్ ఇయ్యాలే, కమిషన్ ఇస్తేనే దళిత బంధు గృహలక్ష్మి ఇస్తారా, అర్హులైన వారికి ఇవ్వరా అంటూ డైరెక్ట్ గా మంత్రిని ప్రశ్నించే టప్పటికీ ఆయనతో పాటు అక్కడున్న నాయకులు అంతా అవాక్కయ్యారు.

హఠాత్తుగా జరిగిన సంఘటన నుంచి తేరుకొని బీఆర్ఎస్ నాయకులు మంత్రి బాడీగార్డ్ లు ప్రశ్నించే వ్యక్తిని దూరంగా తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయగా అతను వినకుండా నిరసన వ్యక్తం చేశాడు.మా వాడకు వచ్చి కూలి పోతున్న మా ఇండ్లను చూడాలి. ఐదేళ్లుగా కిరాయిండ్లలో జీవనం గడుపుతున్న బతుకులను మంత్రి చూడాలి. మా బాధలను ఆయనతో చెప్పుకుంటామని మహిళలు మరో వైపు డిమాండ్ చేశారు. ఎస్సీ కాలనీలో అడుగుపెట్టగానే వ్యతిరేకత కనిపించడంతో మంత్రి స్థానిక నేతల పై మండి పడుతూ అసహనం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న నేతలు చూసుకో వద్దా ఇలాంటి ప్రదేశంలోకి తనని ఎందుకు తీసుకు వస్తారని మండిపడ్డారు. మాకెందుకు దళిత బంధు రాదంటూ పలువురు దళిత మహిళలు ప్రశ్నించారు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు మావి కూలిపోయే ఇల్లలో కాలం గడుపుతున్నాము. కొందరికి ఇల్లు లేక ఐదేళ్లుగా కిరాయికుంటూ జీవనం సాగిస్తున్నాం.

అయినా మాకు దళిత బంధు రాదు, గృహలక్ష్మి రాదా అంటూ మహిళలు ప్రశ్నించారు. దళితులకు సమాధానం చెప్పలేక ఈ తలనొప్పి నాకు ఎందుకని వెను దిరిగి వెళుతున్న మంత్రి స్థానిక నాయకుల విజ్ఞప్తితో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రశ్నించే వారి వద్దకు వెళ్లకుండా పక్క వీధి నుంచి మరికొంతమంది దళితుల వద్దకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చెప్పింది చేస్తుంది చేసేది చెప్తుందని, దళిత బంధును అందరికీ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని, కాస్త సమయం పడుతుందని అందరూ ఓపికతో ఉండాలని నమ్మ బలికారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో ఓట్ల ముందట మీ ఇంటి ముందుకు వచ్చే వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మా ఇల్లు చూడాలే మా బాధలు వినాలని దళిత బంద్ గృహలక్ష్మి ఇయ్యాలని ప్రశ్నించిన దళితుల రోదనలు బీఆర్ఎస్ నేతల ముందు అరణ్యరోదనలే అయ్యాయి. అనంతరం మంత్రి మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లు వ్యాపార సముదాయాలకు వెళ్లి ప్రత్యక్షంగా పలకరించి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నిస్తే కేసులే,ఎలక్షన్ కోడ్ ఉంది జాగ్రత్త..

ఎలక్షన్ కోడ్ ఉంది జాగ్రత్త తమాషా చేస్తున్నారా, ప్రశ్నించి, గొడవ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని, ప్రచారానికి వచ్చిన నాయకులు చెప్పింది, చెప్పినట్లుగా వినాలే అతిగా మాట్లాడవద్దు, నిరసన చేయద్దు గొడవలు పడొద్దు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎవరు చెప్పినా వినం పోలీసులదే నడుస్తుంది. కేసులు పెడతాం అంటూ వెల్గటూర్ ఎస్సై శ్వేత దళితులను హెచ్చరించారు. ఓ దశలో మంత్రిని ప్రశ్నించిన ఐదుగురిని పోలీస్ బండి ఎక్కించి కేసులు నమోదు చేయండని అని హుకుం జారీ చేశారు.మా బాధలను మంత్రికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే మాపైనే కేసులు నమోదు చేస్తామని ఎస్సై చెప్పడంపై దళితులు మండిపడ్డారు, ప్రశ్నిస్తే కేసులు పెడతారా ఎంతమంది మీద పెడతారు. ఎన్ని కేసులు పెడతారు పెట్టుకుంటే పెట్టుకోండి అని దళితులు చివరకు తెగేసి చెప్పారు. ఇప్పటికే మా పై స్థానిక మహిళా నేత రెండు కేసులు పెట్టించిందని నరేష్ అనే యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా బాధలను మంత్రికి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మాలాగే మా ఓట్లు కూడా అవసరం లేదు కావచ్చు అని దళితులు నిరసన వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు.


Next Story

Most Viewed