- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి
అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు పెడుతున్న మానసిక, శారీరక వేధింపులు తాళలేక ఓ వివాహిత గడ్డిమందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది.

దిశ, గంగాధర : అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు పెడుతున్న మానసిక, శారీరక వేధింపులు తాళలేక ఓ వివాహిత గడ్డిమందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ గురువారం వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట్ గ్రామానికి చెందిన నలువాల ఓదయ్య కుమార్తె నాగరపు లాస్య అలియాస్ నలువాల మమత (32)కు, గంగాధర మండలం గోపాల్ రావుపల్లికి చెందిన నాగరపు అనిల్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, గత కొంతకాలంగా భర్త అనిల్‌తో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు అదనపు కట్నం తీసుకురావాలంటూ మమతను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు.
అత్తింటివారి వేధింపులను భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన మమత.. ఈ నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు (గ్రామక్సోన్) సేవించింది. గమనించిన గ్రామస్థులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని తక్షణమే కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో మృత్యువుతో పోరాడిన మమత.. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ కన్నుమూసింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అదనపు కట్నం కోసం వేధించి, తమ కుమార్తె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి నలువాల ఓదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త అనిల్‌తో పాటు మామ, అత్త, ఆడబిడ్డలపై చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. వంశీకృష్ణ స్పష్టం చేశారు. బాధితురాలి మృతితో గోపాల్రావుపల్లి, సోమారంపేట్ గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.






