- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు మరోసారి ఘోర రోడ్డు

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి వరంగల్ వైపుగా పల్లీల లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ లారీ... ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా లారీ క్యాబిన్ లోపల ఇరుక్కుపోయిన డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. డ్రైవర్ వివరాలు వెంటనే తెలియరాలేదు. దీంతో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదాలకు నెలవుగా మారిన కళాశాల మూలమలుపు
ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందున్న ఈ మూలమలుపు గత కొన్నేళ్లుగా తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతం. గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఇదే మూలమలుపు వద్ద ఓ లారీ బోల్తా పడింది. మరొక లారీ కళాశాల బోర్డును, ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కళాశాల గోడ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే మరొక భారీ వాహనం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం ఢీ కొట్టింది. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రహదారిపై అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డులు గానీ, వేగ నియంత్రణ చర్యలు గానీ చేపట్టకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మానవ ప్రాణం పోతేనే అధికారులు మేల్కొంటారా? అంతవరకు చర్యలు తీసుకోరా?" అని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






