గోదావరిఖనిలో మద్యం కల్తీ సర్వ సాధారణం!

by Thanuru Gopichand |

రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో మద్యం దందా హద్దులు దాటుతోంది. తక్కువ ఖర్చుతో రూ.కోట్లు గడించాలనే ఆశతో మద్యం వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

గోదావరిఖనిలో మద్యం కల్తీ సర్వ సాధారణం!
X

దిశ, గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో మద్యం దందా హద్దులు దాటుతోంది. తక్కువ ఖర్చుతో రూ.కోట్లు గడించాలనే ఆశతో మద్యం వ్యాపారులు వినియోగదారుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఇక్కడ మద్యం కల్తీ చేయడం అనేది ఒక సాధారణ ప్రక్రియగా మారిందని, రసాయనాలు, నాసిరకం స్పిరిట్‌ను కలిపి విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కల్తీ మద్యం సేవించిన వారు కడుపు నొప్పి, వాంతులు, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అనేక కుటుంబాలు ఈ మద్యం మహమ్మారి వల్ల రోడ్డున పడుతున్నా సంబంధిత శాఖ అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధిక ధర కలిగిన బ్రాండ్లను లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ఈ కల్తీ ప్రక్రియ సాగుతోందని తెలుస్తోంది. బహిరంగంగా దందా జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించకపోవడం వెనుక భారీగా మామూళ్లు అందుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో మద్యం వ్యాపారం ప్రాణాంతక దందాగా మారింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనే దురాశతో ఇక్కడి వ్యాపారులు మద్యం కల్తీ చేయడాన్ని పరిపాటిగా మార్చుకున్నారు. మద్యం పేరుతో వినియోగదారులకు విషాన్ని అమ్ముతూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ కల్తీ మద్యం తాగి నిత్యం అనేకమంది మద్యంప్రియులు అనారోగ్యం పాలై ఆస్పత్రుల పాలవుతున్నారు. మద్యం వ్యాపారస్తుల కాసుల కక్కుర్తి కారణంగా అనేకమంది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నాశనం అవుతున్నా వ్యాపారులకు మాత్రం తమ సంపాదన తప్ప మరేమీ పట్టడం లేదు. ఎక్సైజ్ అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతుండడంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడమే కాకుండా కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడం ఇక్కడి విచ్చలవిడి దందాలకు ఊతమిస్తోంది. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి సాగిస్తున్న ఈ మాఫియాపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

అడ్డగోలుగా మద్యం కల్తీ...

స్థానికంగా ఉన్న మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో నాసిరకం స్పిరిట్, రసాయనాలు, రంగు, వాసన కోసం ప్రమాదకర పదార్థాలను వాడుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల తాగేవారిలో నరాల బలహీనత వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకపక్షం కానీ, ప్రతిపక్షం కానీ స్పందించకపోవడం గమనార్హం. ఏదైనా స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తే వారిని తమ ఆర్థిక బలంతో మేనేజ్ చేయడంలో మద్యం వ్యాపారులు ఆరితేరిపోయారు. ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు చేయకపోవడం, కనీసం మద్యం నమూనాలను సేకరించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

నిపుణుల ఆధ్వర్యంలో కల్తీ...

ఈ కల్తీ దందా వెనుక ఒక ప్రత్యేక నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్ల మూతలను నేర్పుగా తీసి అందులో నీళ్లు, స్పిరిట్ కలిపి తిరిగి సీల్ వేయడంలో ఆరితేరిన నిపుణులను (ఎక్స్‌పర్ట్స్) ఈ పని కోసం నియమించుకుంటున్నారు. ముఖ్యంగా అధిక ధర కలిగిన బ్రాండ్లను లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ఈ కల్తీ ప్రక్రియ సాగుతోంది. కల్తీ మద్యానికి బానిసలై ప్రభుత్వ ఉద్యోగులు సైతం పిచ్చివారిలా రోడ్లపై తిరుగుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలను వెంటనే సీజ్ చేయాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైన్ షాపుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం

బ్రాండ్ షాపులను నిత్యం తనిఖీలు చేస్తుంటాం. ఏమైనా తేడాగా అనిపిస్తే షాపుల యాజమాన్యాలపై కేసులతోపాటు జరిమానా కూడా విధిస్తున్నాం. ఎక్కడైనా కల్తీ జరిగినట్టు అనుమానాలు ఉంటే ప్రజలు, వినియోగదారులు మాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్రాండ్ షాపులలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తాం.

- మైపాల్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్

Next Story