- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఎల్-3’ గ్రహణం.. సగం కట్టాక బిల్లులు కట్.. లబ్ధిదారుల అరిగోస!
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎల్-3 నిబంధనల సెగ! కరీంనగర్ జిల్లాలో 2 వేల మందికి పైగా అనర్హత. సగం నిర్మించిన ఇళ్లకు బిల్లులు నిలిపివేయడంతో లబ్ధిదారుల ఆవేదన.

దిశ,కొత్త పల్లి: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎల్-3 కింద పెట్టిన నిబంధనలు అర్హులైన పేదలను పథకానికి దూరం చేస్తున్నాయి. 360 డిగ్రీల సర్వే, సామాజిక ఆర్థిక సర్వేలో తేల్చిన అంశాల పేరుతో దారిద్రరేఖకు ఎగువన ఉన్నారని చూపుతూ పేదలను సైతం ఇందిరమ్మ పథకానికి అనర్హులను చేశారు. స్వయం ఉపాధి కింద కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి కిరాయిలకు నడుపుతున్న వారిని సైతం అనర్హులుగా తేల్చారు. బ్యాంకు రుణాల కోసం పాన్ కార్డులు తీసుకుని ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిని, ఆత్మగౌరవంతో జీవించాలనే తాపత్రయంతో వారసత్వంగా వచ్చిన ఇళ్ల స్థలాల్లో రేకుల ఇళ్లు, ఒక గది శ్లాబ్ వేసుకున్నవారు వాస్తవానికి పేద కుటుంబాలైనప్పటికీ ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వారిని బీపీఎల్ కు ఎగువన ఉన్న వారీగా గుర్తించారు.
ప్రజాపాలన కింద ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు లబ్ధిదారులను ఎల్-3 కింద కేటాయించడంతో వారికి ఇందిరమ్మ పథకం దక్కని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సుమారు 2వేల మంది వరకు ఎల్-3 కింద గుర్తించి వారి దరఖాస్తులను బ్లాక్ లిస్టులో పెట్టారు. మరో 340 మంది వరకు ఇందిరమ్మ ఇళ్లకింద తొలుత అర్హులుగా ఎంపిక చేయడంతో వారు ఇళ్లను సగం మేర నిర్మించాక ఎల్-3గా పేర్కొంటూ బిల్లులు నిలిపివేయడంతో ఇప్పుడు వారంతా లబోదిబోమంటూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
దరఖాస్తుల్లో ఎల్-3గా గుర్తించినవి రెండువేల పైనే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయా నియోజకవర్గంలో ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 70 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. భారీగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో పథకం కింద లబ్ధిదారుల ఎంపి కను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇళ్ల స్థలం ఉండి, ఇల్లు లేని పేదలను ఎల్-1 లబ్ధిదారులకు, ఇళ్ల స్థలం, ఇళ్లు రెండూ లేని వారిని ఎల్-2 లబ్ధిదారులుగా, ఇల్లు ఉన్నవారిని, ఫోర్ వీలర్ ఉన్నవారిని, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారిని ఎల్-3 కింద కేటాయించారు. తొలిదశలో ఎల్-1 కేటగిరీ లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయగా, నిర్మాణాలు చేపట్టారు. అయితే వాస్తవానికి సొంతిల్లు లేకపోయినా, వారసత్వంగా వచ్చిన ఇళ్ల స్థలాల్లో నాలుగు గోడలు నిర్మించి నామమాత్రంగా ఒక గది శ్లాబ్ వేసుకొని ఉంటున్న వారిని కూడా అనర్హులుగా తేల్చారు.
అదేవిధంగా జీవనోపాధి కోసం ఫోర్‌వీలర్ కొనుగోలు చేసిన వారిని, పట్టణాల్లో చిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారిని సైతం అనర్హులుగా తేల్చారు. అదేవిధంగా చిరు వ్యాపారాలు చేసుకునేవారు మొదలు బ్యాంకు రుణాలు తీసుకునేవారంతా సిబిల్ స్కోర్ కాపాడుకునేందుకు, బ్యాంకుల్లో పరపతి పెంచుకునేందుకు ఆదాయం ఎంత ఉన్నా, ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తూ వస్తున్నారు. వారందరినీ సైతం దారిద్రరేఖకు ఎగువన ఉన్నవారిగా గుర్తించి వారిని ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులుగా నిర్ధారించారు. జిల్లాలో ఈ కేటగిరీలో దాదాపు 2 వేల పైచిలుకు దరఖాస్తులను బ్లాక్ చేశారు. మరో 300 మందిని తొలుత ఎల్-1 కింద గుర్తించి ఇళ్లు మంజూరు చేయగా వారంతా ఇళ్లను సగం మేర నిర్మించుకున్నారు.
ఇళ్ల నిర్మాణాలు కొనసాగే సమయంలో లబ్ధిదారుల జాబితాలతో 360 డిగ్రీ సర్వే పేరుతో ఇచ్చిన నివేదికలో వారికి ఫోర్‌వీలర్ ఉందనో, అపార్ట్మెంట్లలో అద్దెకుంటున్నారనో, లేదా ట్రాక్టర్ఉందనో, ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారనో కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. దీంతో వీరంతా తాము పేదవాళ్లమేనని, బతుకుదెరువు కోసం తీసుకున్న వాహనాలను విలాస కేటగిరీలో చూపడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ ఎమ్మెల్యేల చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇళ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎల్-3 కింద పేర్కొన్న జాబితాలో చాలామంది ఇలాంటివారే ఉన్నారని, వీటన్నింటిపై అధికారులు మానవతాదృక్పథం, వాస్తవిక పరిస్థితి ఆధారంగా మరోసారి పరిశీలన చేసి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఖర్చు భారం
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. నిర్మాణాలకు వినియోగించే మెటీరియల్ ధరలు భారీగా పెరగడంతో అదనపు భారం పడుతున్నది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. మొరం, ఇసుక, కంకర, స్టీల్, ఇటుక, మార్బుల్ ఇలా ప్రతిదీ భగ్గుమంటున్నాయి. చాలా వరకు రెట్టింపు కంటే ఎక్కువే పెరిగాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ధరలు కూడా ఆకాశాన్నంటుత్నునాయి.
రెండేళ్ల క్రితం ఒక ఇటుక ధర 5 నుంచి 6 మధ్యలో ఉండగా, నేడు 9 నుంచి 12 కు చేరింది. అలాగే ట్రాక్టర్ మొరం ధర గతంలో 1500 ఉండగా, నేడు 3వేలకు చేరింది. ఇసుక ట్రాక్టర్ ధర 1400 నుంచి 1600 ఉండగా, నేడు 3వేలకుపైనే చేరింది. కంకర ట్రిప్పు ధర 1,800 నుంచి 2,400కి చేరింది. డస్ట్ ట్రిప్పు 1400 నుంచి 3500కి చేరింది. దీనికి తోడు మేస్త్రీలు, సుతార్లు, కూలీలు సైతం రేట్లు పెంచారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ధరలతో ఇందిరమ్మ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
ఇందిరమ్మ ఇల్లచ్చిందని సంబురపడి ముందర వడ్డందుకు అరిగోస పడుతున్నారు. సర్కారు ఇచ్చే 5లక్షలు ఏ మూలకూ సరిపోక.. అప్పులు తేలేక తండ్లాడుతున్నారు. బంగారం ఉన్నోళ్లు తనఖా పెట్టో.. అమ్మేసో వచ్చిన పైసలతో ఇండ్లను పూర్తి చేస్తుంటే.. ఏమీ లేనోళ్లు అప్పుల బాట పడుతున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో ప్రైవేట్‌గా రెండు మూడు చొప్పున వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారు. అవీ పుట్టకుంటే నిర్మాణాలను మధ్యలోనే ఆపివేస్తున్నారు.






