మమ్మల్ని చంపి ఇసుక తోడండి

by Thanuru Gopichand |   (  Updated:2025-12-30 02:28:07  IST  )

ఇసుక తవ్వకాలు ఆ గ్రామాన్ని వల్లకాడుగా మార్చాయి. ఇసుక రీచ్ లతో ఊటూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి.

మమ్మల్ని చంపి ఇసుక తోడండి
X

దిశ, మానకొండూరు : ఇసుక తవ్వకాలు ఆ గ్రామాన్ని వల్లకాడుగా మార్చాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుకరీచ్ లు చేపట్టిన ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటగా రీచ్ నిర్వాహకులు చేపట్టిన ఇసుక తవ్వకాలతో పూర్వికుల సమాధులు కనుమరుగయ్యాయి. శవాలు కుప్పలు కుప్పలుగా తేలి బొక్కలు మిగిలాయి. ఇక మిగిలింది మేమే మమ్మల్ని చంపి మా శవాల మీద నుంచి ఇసుకలారీలను తరలించండి.. అంటూ ఇసుక తవ్వకాల కోసం రీచ్ నిర్వాహకులతో కలసి హద్దులు నిర్ణయించేందుకు వచ్చిన టీఎస్ఎండీసీ, మైనింగ్ అధికారులను ప్రజలు అడ్డుకోవడం ఇసుక తవ్వకాలతో ఊటూర్ గ్రామంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇసుక తవ్వకాలపై గ్రామస్తుల ఆగ్రహం

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్ గ్రామంలో పక్కనే మానేరు వాగు ఉండగా తాగునీటికి జనం ఇక్కట్లు తప్పడం లేదు. వ్యవసాయ బావుల్లో భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయానికి గడ్డుకాలం దాపురించింది. గ్రామంలో పూర్వం నుంచి ఎవరైనా అనారోగ్యంతో కాని వృద్ధాప్యంతో గాని మరణిస్తే పక్కనే ఉన్నా మానేరు వాగులో దహన సంస్కారాలు నిర్వహించే వారు. అయితే ఇసుక తవ్సవకాల కారణంగా ఆ సమాధులు కనుమరుగయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కొత్తగా ఇసుక రీచ్ ఏర్పాటు చేసేందుకు టీఎస్ఎస్ఎండీసీ మైనింగ్ అధికారులు ఇసుకరీచ్ నిర్వాహకులతో కలసి మానేరు వాగులోకి హద్దులు నిర్ణయించేందుకు రావడంతో అడ్డుకుని తమ బాధను అధికారుల ముందు వెళ్లగక్కారు.

మా గొంతు ఎండిపోతుంటే.. మీరు అమ్ముకుంటారా?

‘ప్రభుత్వం మా ప్రాణాల మీద వ్యాపారం చేస్తోందా?’ అంటూ ఊటూర్ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. మానేరు వాగులో ఇసుక తవ్వకాలను సోమవారం అడ్డుకుంటూ గ్రామ యువత, మహిళలు, వృద్ధులు కలిసి భారీ నిరసన చేపట్టారు. మేము చనిపోతుంటే మా చావులను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆదాయం కోసం ఇసుక తవ్వకాలు చేస్తుందా.. అంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఆత్మహత్యలే శరణ్యం

టీఎస్ఎండీసీ, మైనింగ్ అధికారులు, రీచ్ నిర్వాహకులు ఇసుక రీచ్ హద్దులు నిర్ణయించేందుకు గ్రామానికి చేరుకున్నారు. తమ వద్ద ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, పనులు ప్రారంభించాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, గ్రామస్తులు ఏకమై అధికారులను అడుగడుగునా అడ్డుకున్నారు. ఒక్క కిలో ఇసుక కూడా బయటకు పోనిచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మానేరు వాగులో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలిస్తే భూగర్భ జలమట్టం పడిపోయి, గ్రామంలో త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే త్రాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయని, ఈ తవ్వకాలు కొనసాగితే ఊరు ఎడారిగా మారుతుందని వారు వాపోతున్నారు.

Next Story