అబద్ధాల కేసీఆర్ కథ ముగిసింది : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
అబద్ధాల కేసీఆర్ కథ ముగిసింది : ధర్మపురి అరవింద్
X

దిశ, కోరుట్ల రూరల్: ఎవరెన్ని మోసాలు చేసిన.. అబద్ధాలు చెప్పిన ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రానుందని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. కోరుట్లలో శుక్రవారం స్థానిక పీబీ గార్డెన్స్ లో నిర్వహించిన బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో అరవింద్ పాల్గొని ప్రసంగించారు. గోదావరి పరివాహక ప్రాంతం అంతా అత్యంత పుణ్య ప్రదేశమని, ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పనిచేస్తుండడం అదృష్టమని అన్నారు. రోజుకో అబద్ధం చెప్పే కేసీఆర్ కథ ముగిసినట్లేనని, తెలంగాణలో కాషాయ రెపరెపలు ఖాయమన్నారు. లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ బీటలు వారడం కేసీఆర్ అవినీతి ప్రభుత్వానికి బీటలు పడబోతున్నయనే దానికి సూచన అన్నారు.

అవినీతి, అబద్ధాలు, మోసాలతో సాగిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటమే తరువాయి అని పేర్కొన్నారు. తాను కోరుట్ల నుండి పోటీ చేస్తే నాన్ లోకల్ అంటూ స్థానిక వాదం మాట్లాడుతున్న సన్నాసులు కేటీఆర్ సిరిసిల్లకు ఎలా లోకల్ అవుతారో చెప్పాలన్నారు. తన అమ్మ పుట్టిన ఊరు కోరుట్లలో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి తనకు ఇంతకన్నా అర్హత ఏమి కావాలని ప్రశ్నించారు. మా అమ్మమ్మ ఇల్లు చిన్నదిగా ఉంటుందని ఎన్నికల ఫలితాల తరువాత క్యాంప్ ఆఫీస్ ఖాళీ అనగానే అక్కడే వచ్చి ఉంటానని పేర్కొన్నారు. కోరుట్లలో కల్వకుంట్ల కుటుంబం భారీ మెజారిటీతో ఓడడం ఖాయమన్నారు. జగిత్యాలలో చెల్లెమ్మకు టికెట్ తెప్పించుకున్న నేను తన గెలుపు కోసం కూడా పని చేస్తానని చెప్పారు. కేసీఆర్ జూటా మాటలు మాని చెప్పిన పథకాలు అమలు చేస్తే బాగుండేదన్నారు. ప్రధాని మోదీ దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రధాని అని కొనియాడారు. మోదీ హవాలో కాషాయం రెపరెపలను ఆపేవారు ఎవరూ లేరన్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టాలు బయటపెడతానని, ఇక వారు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే నన్నారు. వరల్డ్ కప్ క్రేజ్ తో పాటు తెలంగాణలో బీజేపీ క్రేజ్ కూడా కొనసాగుతున్నదని, కార్యకర్తలు ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండలంలోని మోహన్ రావు పేటకు చెందిన పలువురు భాజపాలో చేరారు. పైసా ఖర్చు లేకుండా కోరుట్ల, జగిత్యాల లో గెలిచి దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నామని, దీనికి కార్యకర్తలు కృషి చేేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ రావు, జె.ఎన్.వెంకట్, సాంబరి ప్రభాకర్, యాదగిబాబు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మొర పెళ్లి సత్యనారాయణ రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి పెళ్లి గోపాల్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ సుఖేందర్ గౌడ్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దాసరి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, పీసారి నర్సయ్య, తిరుమల్, కోరుట్ల కౌన్సిలర్లు పెండెం గణేష్, మాడవేని నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుడవేని మహేష్, రాజ మురళి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed