బీజేపీ, బీఆర్ఎస్‌లు రైతుల నోట్లో మట్టి కొట్టాయి: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |
బీజేపీ, బీఆర్ఎస్‌లు రైతుల నోట్లో మట్టి కొట్టాయి: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే, కనీస మానవత్వం లేకుండా స్వార్థ రాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏమిటనీ? ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజనాలో రూపాయి లేకుండా ఆగం చేసి పోతే.. తాము రైతుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి.. రైతు భరోసా (రైతుబంధు) వేశామన్నారు. బీజేపీ కుటిల రాజకీయాల చేసి అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సమయం కంటే ముందుగా నే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా ఆదేశాలు ఇచ్చాన్నారు. రైతులంతా తమ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని సంతోషపడే లోపలే.. ఈసీ ని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడిన నిధులు ఆపేలా కుట్రలు చేయడం బాధాకరమన్నారు. బీజేపీకి మొదటి నుంచి అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం అని, అందుకే నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసిందన్నారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది రైతులను పొట్టన పెట్టుకున్నదన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల రోజునే కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేశారని, అప్పుడు ఆపని ఈసీ ఇప్పుడు ఎందుకు నిధులు ఆపింది..? అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ,బీజేపీ కలిసి ఆడుతున్న నాటాకాలని ప్రజలు ఇప్పటికే గుర్తించారని, ఆ రెండు పార్టీలకు రైతులే తగిన గుణపాఠం చెప్తారన్నారు.

Next Story