- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 'జయన్న ఫౌండేషన్' భరోసా
పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో హుజురాబాద్ మండలం సింగాపూర్‌కు చెందిన 'జయన్న ఫౌండేషన్' మరో ఉదార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిశ, హుజురాబాద్ రూరల్ : పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో హుజురాబాద్ మండలం సింగాపూర్‌కు చెందిన 'జయన్న ఫౌండేషన్' మరో ఉదార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రితో పాటు, రవాణా, అల్పాహార ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేసింది. బుధవారం హుజురాబాద్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పంపిణీ చేశారు. మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఒత్తిడిని జయించండి.. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయండి
కేవలం వస్తు రూపంలో సాయం చేయడమే కాకుండా.. విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఫౌండేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంది. వరంగల్ నుంచి వచ్చిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులతో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఒత్తిడిని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో నిపుణులు దిశానిర్దేశం చేశారు. "ప్రభుత్వ బడిలో చదివిన ఎందరో నేడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా రాణిస్తున్నారు. విద్యార్థులు అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అని ఫౌండేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
300 మంది విద్యార్థులకు చేయూత...
హుజురాబాద్ మండలంలోని 13 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు చేయూతనందించారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి రూ. 700 నగదు పంపిణీ, ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, హాల్ టికెట్లు భద్రపరుచుకునే కవర్లు అందించారు. పదో తరగతి ఫలితాల్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్ ప్రకటించింది.
"చిన్నతనంలో ఎగ్జామ్ ప్యాడ్ లేక పక్కవారిని అడిగి పరీక్ష రాసిన కష్టం నాకు తెలుసు. నాటి నా అనుభవం ఏ విద్యార్థికి ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. వచ్చే జూన్ నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులు, బ్యాగులు, పుస్తకాలతో పాటు విద్యార్థినులకు ఏడాదికి సరిపడా శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందజేస్తాం'' అని సరిత జయపాల్ రెడ్డి తెలిపారు. విద్యతో పాటు వైద్య రంగంలోనూ జయన్న ఫౌండేషన్ తన ముద్ర వేస్తోంది. గతంలో 5,000 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 1,289 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించింది. మార్చి 20 నుండి పునఃప్రారంభం కానున్న మెడికల్ క్యాంపుల ద్వారా మరిన్ని సేవలు అందించనున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. సంపాదించే సంపాదనలో 50 శాతం సమాజ సేవకే వెచ్చిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ ఖలీక్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, వేల్పుల రత్నం, పలకల ఈశ్వర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.






