మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వాలు : MLA Sridhar Babu

by Disha Web Desk 1 |
మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వాలు : MLA Sridhar Babu
X

దిశ, వెల్గటూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఆయన తన తల్లితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు, దళిత బంధు గృహలక్ష్మి లాంటి పథకాలను ప్రజల ముందుంచగా, విశ్వకర్మల పథకం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరోసారి మధ్య తరగతి ప్రజల ఆశలను ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందన్నారు. వారు ప్రవేశ పెడుతున్న జనాకర్షక పథకాలకు ప్రజలు మరోసారి మోసపోయి ఐదేళ్ల పాటు గోస పడొద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టేశాయని ఆరోపించారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి కేంద్రం మాట తప్పగా ఒక్క గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేక అభాసు పాలైన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. రూ.120 వేల కోట్లతో నిర్మించబడిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికైనా నీరు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మెగా కంపెనీ కోసమే వెల్గటూర్ మండలంలో రూ.21 వేల కోట్లతో కాళేశ్వరం లింకు టూ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసి రైతుల భూములను లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.

అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన నియోజకవర్గంలో ప్రతి దళితుడికి దళితబంధు అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘనభట్ల దినేష్, శైలేందర్ రెడ్డి, రాములు గౌడ్, ఆవుల శ్రీనివాస్, సింహరాజు ప్రసాద్, కుంట సుధాకర్, రాందేని మొగిలి శ్రావణ్, అప్పం తిరుపతి, వేముల రాజేష్, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed