ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి

by Ratna Kumari |

ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ కోరారు.

ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి
X

దిశ, గంగాధర : ఎండిపోయిన పంటలకు వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు కొప్పుల వెంకటేష్ కోరారు. గంగాధర మండలం ఉప్పెర మల్యాల గ్రామ రెవెన్యూ పరిధిలో నీటి కొరత కారణంగా ఎండిపోయిన పంట పొలాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ చార్జి కొప్పుల వెంకటేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల పరిసర గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పంట నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా చెరువుకు కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న పొలాలకు కూడా నీరు అందక పంటలు ఎండిపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఉప్పెర మల్యాల, వెంకంపల్లి గ్రామాలకు చెందిన రైతులు మల్యాల అనిల్, మధుసుదన్ రెడ్డి, ముక్కెర పర్షరాములు పొలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. కుడి కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30,000 చొప్పున వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల అధ్యక్షుడు ముక్కెర గంగరాజు, యువజన విభాగం అధ్యక్షుడు పలుమారి సతీష్, యూత్ ప్రధాన కార్యదర్శి బండ గంగరాజు, గుండవేణి నరేష్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Next Story