ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ

by velandi.Saikiran |   (  Updated:2025-11-27 22:30:26  IST  )

కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోగం తీరును బట్టి బిల్లులు వసూలు చేయాల్సిన

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ
X

దిశ బ్యూరో, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోగం తీరును బట్టి బిల్లులు వసూలు చేయాల్సిన ఆస్పత్రులు, బిల్డింగ్‌ల రూపు రేఖలను బట్టి బిల్లులు వసూలు చేస్తామంటూ కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నాయి. ఆస్పత్రిలో అడుగుపెట్టే వరకు ఒక లెక్క, అడుగు పెట్టాక మరో లెక్క అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆ బిల్లులు తాము చెల్లించలేం, వెళ్లిపోతాం అన్నప్పటికీ వదల బొమ్మాళీ అన్నట్టుగా వ్యవహరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతూ చికిత్స కోసం వచ్చిన తలారి రాజవ్వ విషయంలోనూ ఇదే జరిగింది. అంత డబ్బు తాము చెల్లించలేమని, వెళ్లిపోతామని చెప్పినప్పటికీ అడిగినంత చెల్లించాల్సిందే అనడంతో చేసేది లేక ఆ బిల్లు కట్టలేక న్యాయం చేయండంటూ వేడుకోవడం ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

అనారోగ్యంతో ఆస్పత్రికి... బిల్లు కట్టలేక బయటకు..

సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన తలారి రాజవ్వకు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండడంతో తన కొడుకులు చికిత్స కోసం నగరంలోని సన్ రైస్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ముందుగా రోజుకు రూ.10వేలు బిల్లు ఉంటుందని, ప్రస్తుతం డాక్టరు అందుబాటులో లేరు, రేపు ఉదయం వచ్చాక పూర్తిస్థాయి చికిత్స అందిస్తామని చెప్పిన యాజమాన్యం, అడ్మిషన్ తీసుకున్నాక మాట మార్చడంతో వివాదాస్పదంగా మారింది. అంత బిల్లు తాము చెల్లించలేం, వెళ్లిపోతాం అన్నప్పటికీ కుదరదంటూ భీష్మించడం వివాదాస్పదంగా మారింది.

రూ.35వేలు బిల్లు చెల్లించాల్సిందే అంటూ ఆస్పత్రి యాజమాన్యం కరాఖండిగా చెప్పడం ఇక్కడి దోపిడీకి అద్దం పడుతోంది. బాధిత రోగి బంధువులు చెప్పిన ప్రకారం వారు ఆస్పత్రికి వచ్చి 24గంటలు తిరక్క ముందే అదనంగా రూ.35వేలు చెల్లించాలంటూ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏమి చేయాలో అర్థం కాక, బిల్లు చెల్లించలేక బిక్కు బిక్కుమంటూ ఆస్పత్రి ఆవరణలో నిలబడడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఒక్కరోజు అంటే 12గంటలే...

ఒక్క రోజు అంటే సహజంగా 24గంటలు, కానీ ఇక్కడి ఆస్పత్రి వారికి మాత్రం 12గంటలకే ఒక్క రోజు. అలా 24గంటలు అంటే తమ భాషలో రెండు రోజులు అంటూ ఆ లెక్కన రూ.20వేలతోపాటు ఐసీయూ అదనపు చార్జీలు కలిపి బిల్లు వేశామని ఆస్పత్రి నిర్వాహకులు అంటున్నారు. తాము ముందే అన్ని చెప్పామని, వాళ్లు టెన్షన్‌లో ఉండి తాము చెప్పింది అర్థం చేసుకోక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ దాటవేస్తున్నారు. అయితే గతంలో పాత భవనంలో ఉండగా చికిత్స తీసుకున్న రాజవ్వ ఇప్పుడు కొత్త బిల్డింగులోకి రావడంతో బిల్లు పెరిగినట్టు ఉందంటూ చెప్పడం వారి అమాయకత్వానికి నిదర్శనం. కాగా, కట్టలేమన్నా కట్టాల్సిందే అంటూ మానవత్వాన్ని మరచిన యాజమాన్యం అమాయకుల రక్తం తాగుతుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి..

బాధితుల ఆందోళనతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చింది. రోగుల నుంచి అధిక ఫీజు వసూలు చేయాలనుకున్న యాజమాన్యం, బాధితులనుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, బాధితులు మీడియాను ఆశ్రయించడంతో ముందు చెప్పిన విధంగానే డబ్బు చెల్లించాలంటూ తోకముడిచింది. ముందు చెప్పిన నిజంగానే డబ్బులు చెల్లించాలని రూ.15వేలకు ఒప్పుకుని ఆ మొత్తాన్ని చెల్లించాక పేషెంటును డిశ్చార్జ్ చేశారు.

ముందు రూ.10వేలు అని రూ.35వేలు కట్టమంటున్నరు..

ఆస్పత్రిలో చేరక ముందు రోజుకు రూ.10వేలు బిల్లు అన్నారు. ఇప్పుడు 35వేలు కట్టాలంటున్నారు. ప్రతి పరీక్షలకు, మందులకు మేమే బిల్లు చెల్లించాం. ఆ బిల్లులే మేం కట్టలేక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తాం అంటే రూ.35వేలు కట్టి వెళ్లమంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌గా రూ.10వేలు చెల్లించాం. ఇంకా రూ.35వేలు అంటే ఎక్కడినుంచి తేవాలి. మాకు న్యాయం చేయాలి.

- తలారి ఐలయ్య, పేషెంటు పెద్ద కొడుకు, లస్మన్నపల్లి

మేం ముందే చెప్పాం

పేషెంటు కుటుంబ సభ్యులకు మేము ముందే చెప్పాం. ప్రతిదీ అర్థం చేయించాం. వారు టెన్షన్‌లో ఉండి అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మేం చెప్పలేదంటే కుదరదు. ప్రతిదీ వీడియో రికార్డు ఉంది. బిల్లు కచ్చితంగా కట్టాల్సిందే.

- నాగరాజు, ఆస్పత్రి మేనేజర్

Next Story