దిశ కథనానికి స్పందన... అక్రమ మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు రద్దు

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలోని సీలింగ్ భూముల వ్యవహారంలో బాధితుల పోరాటానికి ఫలితం దక్కింది.

దిశ కథనానికి స్పందన... అక్రమ మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు రద్దు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలోని సీలింగ్ భూముల వ్యవహారంలో బాధితుల పోరాటానికి ఫలితం దక్కింది. గ్రామ సర్పంచ్‌తో కలిసి బాధితులు గత నెలలో సీఎంఓ తో పాటు ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి సమగ్ర విచారణ చేయాలని కోరారు. బాధితుల పక్షాన నిలబడిన ‘దిశ’ కొడిమ్యాల లో ‘సీలింగ్ భూముల మాయాజాలం’ అంటూ జూన్ 16 న కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేపట్టింది. విచారణలో సర్వే నంబర్ 545లో 11.26 ఎకరాలు, సర్వే నంబర్ 551లో 11 ఎకరాల భూములు భూ పరిమితి (సీలింగ్) చట్టం కింద ప్రభుత్వానికి సంక్రమించినవేనని తేలడంతో అనంతరం జరిగిన మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు చట్టబద్ధం కావని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ భూములను తిరిగి ప్రభుత్వ ఖరీఝ్ ఖాతాలో నమోదు చేసి స్వాధీనం చేసుకోవాలని జూలై 7 న ఉత్తర్వులు జారీ చేస్తూ కొడిమ్యాల ఎమ్మార్వోను ఆదేశించడం జిల్లాలో సంచలనంగా మారింది.

సీలింగ్ భూములకు మ్యుటేషన్లు ఎలా జరిగాయి.?

సంబంధిత భూమి కొడిమ్యాల మండలానికి చెందిన పొనుగోటి లక్ష్మణ్ రావు తండ్రి మంగారావు కుటుంబానికి చెందినదిగా రికార్డుల్లో ఉండగా.. భూ పరిమితి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 22 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తర్వాత భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా 1989లో ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులు వెలువడగా , 1992లో ప్రభుత్వ స్వాధీనం, 1996లో రాంసాగర్, హిమ్మత్ రావుపేటకి చెందిన 12 మంది ఎస్సీ, 10మంది బీసీ, 1 ఓసీ మొత్తం 23 మంది లబ్ధిదారులకు అసైన్డ్ పట్టాల కింద పంపిణీ జరిగినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. ఇంత స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ అవే భూములు తరువాత ప్రైవేటు వ్యక్తుల పేర్లపై మ్యూటేషన్లు జరగడం, పట్టాదార్ పాస్‌బుక్కులు జారీ కావడం, కోట్ల రూపాయల భూ లావాదేవీలు జరగడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ రికార్డుల్లో సీలింగ్ భూములుగా నమోదైన భూములకు మ్యూటేషన్లు ఎలా జరిగాయి? రెవెన్యూ వ్యవస్థలో ఏ స్థాయిలో లోపాలు చోటు చేసుకున్నాయి? అనే ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆ మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు చెల్లవు

పొనుగోటి కృష్ణారావు, గోలి అనిత, పొనుగోటి హరీష్, పొనుగోటి నరేష్, బొడ్ల సతీష్, బొడ్ల ఉమాదేవి పేర్లపై 2018 నుంచి 2025 మధ్య జరిగిన మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు చట్టబద్ధం కావని కలెక్టర్ సత్య ప్రసాద్ నిర్ధారించారు. వీరి పేర్లను రెవెన్యూ రికార్డులు, భూ-భారతి నమోదుల నుంచి తొలగించి మొత్తం భూమిని ఖరీఝ్ ఖాతా (ప్రభుత్వ భూమిగా రికార్డ్) లో నమోదు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2018 నుంచి 2025 వరకు ఈ భూములకు సంబంధించి జరిగిన ఏడు లావాదేవీలలో నాలుగింటిలో అమ్మినవారికి అసలు యజమాన్య హక్కులు లేవని మిగిలిన మూడింటిలో ఒకటి ఇల్లీగల్ మ్యుటేషన్ కాగా మరో రెండింటికి సరైన పత్రాలు లేవని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత ఎనిమిదేళ్లలో ఈ భూములపై ఆరు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

అధికారుల పాత్రపై విచారణకు డిమాండ్

ప్రభుత్వ భూములేనని అధికారిక రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ మ్యూటేషన్లు, పట్టాదార్ పాస్‌బుక్కులు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయన్న అంశంపై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ అక్రమ భూ లావాదేవీల్లో ఎవరి పాత్ర ఏ మేరకు ఉంది? అప్పటి రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విధుల దుర్వినియోగానికి పాల్పడ్డారా? లేక కుమ్మక్కు అయిన కారణంగా ప్రభుత్వ భూములు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, బాధితులు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఫ్రాడ్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి..నీలగిరి గంగారావు,, రాంసాగర్ సర్పంచ్

మా గ్రామ సీలింగ్ భూముల ఆక్రమణ పై సీఎంఓ కార్యాలయం తో పాటు కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ స్పందించి ఎంక్వయిరీ చేపట్టి భూములను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం సంతోషం. అయితే ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములు ప్రైవేట్ వ్యక్తులపై ఎలా పట్టాలయ్యాయో తేల్చాలి. అధికారుల పాత్రపై కూడా లోతైన విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.

Next Story