ఆత్మహత్య అంచుల నుంచి వెనక్కు లాగిన ధర్మపురి సీఐ

by Bhanu |

కొందరికి వృత్తి కేవలం బాధ్యత కాదు.. సేవే ధ్యేయం. ధర్మపురి సీఐ ఎ. రాంనరసింహ రెడ్డి అలాంటి పాత్రకే న్యాయం చేశారు.

ఆత్మహత్య అంచుల నుంచి వెనక్కు లాగిన ధర్మపురి సీఐ
X

దిశ, వెల్గటూర్ : కొందరికి వృత్తి కేవలం బాధ్యత కాదు.. సేవే ధ్యేయం. ధర్మపురి సీఐ ఎ. రాంనరసింహ రెడ్డి అలాంటి పాత్రకే న్యాయం చేశారు. ఆత్మహత్య చేసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తిని చాకచక్యంగా కాపాడి మరో జీవితం నిలబెట్టారు. ఈ మానవీయ ఉదంతం సోమవారం ధర్మపురిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి పట్టణానికి చెందిన గడిపెళ్లి గోపి అలియాస్ గోపాల్ (42) కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. భార్యతో తరచూ జరుగుతున్న గొడవల నేపథ్యంలో.. మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన గోపి, ధర్మపురిలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునే యత్నం చేశాడు.

సమాచారం అందుకున్న వెంటనే సీఐ రాంనరసింహ రెడ్డి తక్షణమే పోలీస్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మైక్ ఏర్పాటు చేసి, గోపికి మానసిక స్థైర్యం కలిగించే ప్రయత్నం ప్రారంభించారు. అతని భార్య, కూతురితో మైక్ ద్వారా మాట్లాడేలా చేసి, భావోద్వేగపూరిత మాటలతో అతని మనసు మార్చేందుకు ప్రయత్నించారు.

దాదాపు గంటన్నర పాటు మాటలు కొనసాగగా.. చివరికి కుటుంబ సభ్యుల మాటలతో ప్రభావితమైన గోపి తన నిర్ణయాన్ని మార్చుకుని, సెల్ టవర్ పై నుంచి కిందకు దిగాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

సీఐ రాంనరసింహ రెడ్డి తన తెలివితేటలతో, వేగవంతమైన చర్యలతో ఒక కుటుంబాన్ని విషాదంలోకి జారకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటనకు ప్రజలు స్పందిస్తూ.. ‘‘ఇవే నిజమైన పోలీసింగ్‌కి నిదర్శనాలు’’ అంటూ ధర్మపురి సీఐ, పోలీసు సిబ్బంది, ఫైర్ సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించారు.

Next Story