కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. సోషల్ మీడియాలో వైరల్

by Bhanu |   (  Updated:2025-05-29 11:33:34  IST  )

కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం అనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట.. ఒకప్పుడు గాంధీభవన్, జిల్లా పార్టీ కార్యాలయం, పలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా కొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు.

కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యం అనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట.. ఒకప్పుడు గాంధీభవన్, జిల్లా పార్టీ కార్యాలయం, పలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా కొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. అయితే ఇప్పుడు కొట్టుకుంటున్న పరంపర పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాలకు పాకింది. కాంగ్రెస్ కార్యకర్తల తన్నులాటతో పార్టీలో క్రమశిక్షణ అదుపు తప్పిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కంటే భిన్నంగా తమ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటూ, సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతుందని ప్రగల్బాలు చెబుతున్నా.. గ్రౌండ్ లెవెల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, క్రమశిక్షణ అనేది అసలు మచ్చుకు కానరావడం లేదు. ఎవరి కంట్రోల్ లో ఎవరు పనిచేస్తున్నారు తెలియని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా గ్రూపు మధ్యన మొదలైన వార్ ప్రత్యక్ష దాడులకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తన్నులాట ఆలస్యంగా వెలుగులోకి వచ్చి, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇల్లందకుంట మండలంలోని భోగంపాడు, మల్లన్నపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు కార్యకర్తల మధ్య వాట్స్అప్ గ్రూపులో కామెంట్లతో మొదలైన చర్చ ప్రత్యక్ష దాడులకు దారితీసింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ గ్రూపులో మెసేజ్ చేసుకుంటూ దమ్ముంటే ఫలానా చోటుకు రావాలంటూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకొని చివరికి మండల కేంద్రానికి చేరుకొని ప్రత్యక్ష దాడులకు దిగడమే కాకుండా, బండరాళ్లతో కొట్టుకునేంతవరకు వెళ్ళింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ, దూషించుకుంటూ ముష్టియుద్ధం చేశారు.

ఓ వర్గానికి చెందిన వ్యక్తి తన అనుచరులకు మద్యం తాగించి దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టినట్లు చర్చ కొనసాగుతుంది. ఓ హోటల్ సమీపంలో జరిగిన ఈ సంఘటనను చూసిన కొందరు ప్రజలు ఇరు వర్గాలను సముదాయించి గొడవను సద్దుమనిగేలా చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్న తీరుపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వర్గానికి చెందిన కార్యకర్తలు కొట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా ఈ విషయంపై ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ను వివరణ కోరగా కొట్లాటతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, వారిద్దరూ వ్యక్తిగతంగా కొట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని స్పష్టం చేశారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన కొట్లాట ఘటనపై మండలంలోని మల్లన్నపల్లి గ్రామానికి చెందిన పసునూటి అన్వేష్ అనే యువకుడు ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశాడు. తాను గత ఆరు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మండల ఎన్ ఎస్ యూఐ మండల అధ్యక్షునిగా పనిచేశానని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం కారణంగా, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తూ, పార్టీ జెండాను మోసుకు వస్తున్న తనలాంటి వారికి అన్యాయం జరుగుతుందన్నారు.

అంతేకాకుండా.. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ చేయగా, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన భోగంపాడు గ్రామానికి చెందిన సామల రాజిరెడ్డి అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నానా దుర్భాషలాడుతూ, నన్ను రెచ్చగొట్టి ఇల్లందకుంట మండల కేంద్రానికి రప్పించే విధంగా చేసి నాపై దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సామల రాజిరెడ్డి తో పాటు కొట్టే రాజశేఖర్, బత్తిని మల్లేష్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

Next Story