- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంప్యూటర్ ఆపరేటర్ల వసూళ్ల పర్వం
రాయికల్ ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసే దళారుల అవతారమెత్తి రైతులను దగా చేస్తున్నారు. భూ క్రయవిక్రయాలు, విరాసత్, గిఫ్ట్ డీడ్‌లు, మిస్సింగ్ సర్వే నంబర్లు, డీఎస్ పెండింగ్ తదితర రెవెన్యూ సేవల కోసం ఆఫీస్ కు వచ్చే రైతులను లక్ష్యంగా చేసుకుని కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దిశ, రాయికల్ : రాయికల్ ఎమ్మార్వో ఆఫీస్ లో పనిచేసే దళారుల అవతారమెత్తి రైతులను దగా చేస్తున్నారు. భూ క్రయవిక్రయాలు, విరాసత్, గిఫ్ట్ డీడ్‌లు, మిస్సింగ్ సర్వే నంబర్లు, డీఎస్ పెండింగ్ తదితర రెవెన్యూ సేవల కోసం ఆఫీస్ కు వచ్చే రైతులను లక్ష్యంగా చేసుకుని కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైరవీకారులతో కుమ్మక్కై భారీ స్థాయిలో దందా సాగిస్తూ పనిని బట్టి రేట్లు ఫిక్స్ చేసీ దండుకున్నట్లు తెలుస్తుంది. మీ సేవ ద్వారా ఆఫీషియల్ దరఖాస్తు చేసుకున్న వారిని కూడా కొర్రీలు పెడుతూ నిలువు దోపిడీ చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా ఎమ్మార్వోకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న కొందరు సిబ్బంది మీ సేవ ఆపరేటర్ల అవతారం ఎత్తి బ్రోకర్ల దందా సాగిస్తున్నరానే ప్రచారం జరుగుతుంది.
భూపతిపూర్ వారసత్వ పట్టా వివాదం..
మే 29న భూపతిపూర్ గ్రామానికి చెందిన ఒక స్థిరాస్తి వారసత్వ పట్టా మార్పు విషయంలో వివాదం చోటుచేసుకుంది. అసలు పట్టేదారు వారసుల పేర్లపై పట్టా మార్పు జరగాల్సి ఉండగా, పట్టేదారు మనవడి భార్య పేరుపై దస్తావేజు సిద్ధం చేసినట్లు సమాచారం. కార్యాలయంలోనే స్లాట్ బుక్ చేసిన ఓ ఆపరేటర్ ఆ దస్తావేజును తహశీల్దార్ వద్దకు తీసుకెళ్లగా పట్టేదారు కుమారుడు, కోడలు కార్యాలయానికి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. తహశీల్దార్ సమక్షంలో వాగ్వాదం జరగడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసి, సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్‌ను మందలించినట్లు తెలిసింది. ఈ ఘటన కార్యాలయ సిబ్బంది భూ వ్యవహారాల్లో జోక్యంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
ఒక్కో పనికి ఒక్కో రేట్..
కార్యాలయంలో భూమి సంబంధిత ప్రతి పనికి ఒక ప్రత్యేక రేటు నిర్ణయించినట్టుగా వ్యవహారం సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఆర్, మిస్సింగ్ సర్వే నంబర్లు, నాలా వితౌట్ పాస్‌బుక్, విరాసత్, పట్టా మార్పులు తదితర దరఖాస్తులతో వచ్చిన రైతులకు సమస్య క్లిష్టంగా ఉందని చెప్పి భయపెడుతున్నారని సమాచారం. అనంతరం జీపీఓలు కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్ల మధ్య సమన్వయంతో ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు నిర్ణయించి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.దీంతో ప్రభుత్వ కార్యాలయంలోనే ప్రతి పనికి ధర కట్టి దందా నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం
నాగార్జున, రాయికల్ ఎమ్మార్వో
రెవెన్యూ ఆఫీసులో స్లాట్ బుక్ చేసి డబ్బులు వసూలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. స్లాట్ బుకింగ్ పేరుతో కొందరు ప్రైవేట్ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు సైతం ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. కార్యాలయానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారిని సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా నా దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడుతాం.






